Sultanabad: సుల్తానాబాద్‌లో రూ.24.18 కోట్ల ధాన్యం పక్కదారి

Sultanabad: సుల్తానాబాద్‌లో రూ.24.18 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో ఇద్దరు రైస్ మిల్లు భాగస్వాముల అరెస్ట్. వెల్లడించిన డీసీపీ.

KONDAL, SULTANABAD
Published on: 17 Aug 2026 4:36 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్‌లో రూ.24.18 కోట్ల ధాన్యం పక్కదారి

సుల్తానాబాద్: ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (CMR) అందించకుండా, రూ. 24.18 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో ఇద్దరు రైస్ మిల్లు భాగస్వాములను సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్బంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో పెద్దపల్లి డిసిపి భూక్యరాంరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలోని M/s. లక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు KMS 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (TGSCSCL) ద్వారా 10,015.636 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం అప్పగించారు. నిబంధనల ప్రకారం మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి 6,662.880 మెట్రిక్ టన్నుల CMR బియ్యాన్ని అందజేయాల్సి ఉండగా, కేవలం 1,577.289 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించారు.

​ఇంకా 5,020.719 మెట్రిక్ టన్నుల బియ్యం (7,493.610 మెట్రిక్ టన్నుల ధాన్యంతో సమానం) బకాయి పడ్డారు. దీని విలువ రూ. 24,18,59,070గా నిర్ధారించారు.​ఈ నెల 6వ తేదీన పౌర సరఫరాల శాఖ అధికారులు మిల్లులో భౌతిక తనిఖీలు చేపట్టగా, నిల్వ ఉండాల్సిన ధాన్యం స్టాక్ మిల్లు ప్రాంగణంలో ఏమాత్రం కనిపించలేదు. ధాన్యాన్ని దారి మళ్లించి దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

​దీనిపై పెద్దపల్లి జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రైస్ మిల్లు మేనేజింగ్ పార్టనర్ రేణికుంట మధు (A-1), పార్టనర్ రేణికుంట రవీందర్ రెడ్డి (A-2) లను సోమవారం ఉదయం 10 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

​నిందితులపై BNS చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (1955), తెలంగాణ రైస్ (కస్టమ్ మిల్లింగ్) ఆర్డర్ (2015) కింద కేసు లు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డీసీపీ పెద్దపల్లి డిసిపి తెలిపారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story