Karimnagar: బండి భగీరథ్ కేసులో చర్యలు తీసుకోవాలి
Karimnagar: బండి భగీరథ్ కేసులో పారదర్శక విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
Karimnagar
Karimnagar: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై 17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిందని, ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారని కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ శాసన సభ్యుడు సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంగాధరలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైనర్ బాలిక ఫిర్యాదు వంటి అత్యంత సున్నితమైన అంశంలో ప్రభుత్వం, పోలీసులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి బాధితురాలికి తక్షణ న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేసు నమోదై ఉన్నప్పటికీ బండి భగీరథ్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడు..? ఎందుకు అరెస్టు చేయడం లేదు..? చట్టం సామాన్యులకు ఒకలా, అధికార పార్టీలకు మరోలా అమలవుతుందా..? అని సుంకె రవిశంకర్ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రానికి “అమ్మనవుతా” అంటూ గతంలో ప్రగల్భాలు పలికిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. బాధిత బాలికకు అన్యాయం చేయాలని మధ్యవర్తిత్వం వహించిన సంగప్పపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రత, బాలికల రక్షణ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇలాంటి కీలక వ్యవహారాల్లో ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. బీజేపీ “బేటీ బచావో” నినాదం నిజమైతే బండి సంజయ్ కుమార్ ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
బాధితురాలు మైనర్ కావడంతో ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని, రాజకీయ ఒత్తిళ్లు లేదా హోదాలు పక్కనపెట్టి వెంటనే బండి భగీరథ్‌ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మైనర్ బాలికకు న్యాయం జరగకపోతే ప్రజల్లో చట్టంపై విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు.
పోలీసులు పూర్తి పారదర్శకతతో విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం మహిళా, బాలల రక్షణ విషయంలో మాటలు కాకుండా చేతల్లో చూపించాలని సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు.
ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారినా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా మంత్రులు, నాయకులు మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించిన ఆయన, నిన్నటి నరేంద్ర మోదీ సభలో “భడే భాయ్ – చోటే భాయ్” బంధం మరోసారి బయటపడిందని వ్యాఖ్యానించారు.
బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.




