Peddapalli: సూపర్ ఎల్‌నినో ప్రభావం: యాసంగి సాగుపై ఆచితూచి నిర్ణయం!
Peddapalli: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో యాసంగి పంటల సాగుపై రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, తాగునీటికే తొలి ప్రాధాన్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Peddapalli: సూపర్ ఎల్‌నినో ప్రభావం: యాసంగి సాగుపై ఆచితూచి నిర్ణయం!
పెద్దపెల్లి: సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని, అనేక ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో మాట్లాడి యాసంగి 2026–27 పంటల సాగు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని రైతు వేదిక నుంచి నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలోని రైతు వేదికల నుంచి రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడం, సాగునీటి లభ్యత పరిమితంగా ఉండటంతో రైతులు యాసంగి 2026–27 పంటల సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో సాగుకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతోందని తెలిపారు. అనేక ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్ లభ్యతకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవడం, ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు.
రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వాస్తవాలను అర్థం చేసుకుని, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితిని బట్టి పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సాగునీరు అందుబాటులో ఉంటుందనే అంచనాతో అధిక నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేసి నష్టపోకుండా జాగ్రత్త వహించాలని కోరారు.
తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ, రానున్న జూన్ వరకు తాగునీటి అవసరాలను తీర్చేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీటి పథకాల్లో సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టి, అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
సాగునీటి లభ్యత తక్కువగా ఉండటంతో పాటు భూగర్భ జలాలు కూడా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రైతులు సాగు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అందించే సూచనలను పాటిస్తూ నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
మనుషులతో పాటు పశుసంపదను కాపాడుకోవాలి
కష్టకాలంలో మనుషుల అవసరాలతో పాటు పశుసంపదను కూడా రక్షించుకోవడం అత్యంత ముఖ్యమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పశువులకు తగినంత తాగునీరు, మేత అందుబాటులో ఉండేలా పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పశువులకు నీటి తొట్లు ఏర్పాటు చేయడంతో పాటు మేత కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడం ఒక్క శాఖతో సాధ్యం కాదని, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. కష్టకాలంలో అధికారులకు సహకరించాలని, వారు అందించే సూచనలు, సలహాలను పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి నుంచే రైతులకు అవగాహన కల్పిస్తోందని తెలిపారు. ముందస్తు అవగాహన, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గిందని, మహబూబ్‌నగర్ ప్రాంతంలో కూరగాయల సాగు పెరిగిందని వివరించారు.
యాసంగిలో అధిక నీటి అవసరం ఉన్న వరి సాగుపై రైతులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వరి పంటకు అధిక ధర లభిస్తోందనే ఆశతో సాగు చేస్తే, నీటి కొరత కారణంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతుల వినియోగాన్ని పెంచేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. రైతులు తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే సూచనలు, అందుబాటులో ఉన్న నీటి వివరాల ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో యూరియా, విత్తనాల లభ్యతకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
నీటి వనరులు, విద్యుత్ సరఫరాపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలి
పంటలకు నీటి సరఫరా, విద్యుత్ లభ్యతపై అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సమాచారం అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఏ ప్రాంతంలో ఎంత నీరు అందుబాటులో ఉంది, ఎంత విద్యుత్ సరఫరా చేయగలమనే వివరాలను స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు.
తాగునీటి సమస్యలు తలెత్తకుండా పాత తాగునీటి పథకాలను మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని, మిషన్ భగీరథ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినా ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు థర్మల్ విద్యుత్ కేంద్రాలు గరిష్ట సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, సౌర విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచాలని సూచించారు.
*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గి, కరువు పరిస్థితులు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రభావం మరింత బలపడవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, ఖరీఫ్ సాగు విస్తీర్ణం 15 శాతం తగ్గిందని వివరించారు. పత్తి, వరి పంటలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, భూగర్భ జలాల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న సింగూరు జలాశయంలో సుమారు 4 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 20 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసినప్పటికీ, దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత నెలకొన్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రైతు భరోసా కింద 75 లక్షల మంది రైతులకు రూ.8,500 కోట్ల నిధులు విడుదల చేశామని, లక్ష ఎకరాలకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశామని, ఖరీఫ్‌లో సబ్సిడీ విత్తనాలు అందించామని వివరించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీరు, పశువుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని, 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలను తీర్చేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. కృష్ణా బేసిన్లో సుమారు 270 టీఎంసీలకు గాను 80 టీఎంసీలు, గోదావరి బేసిన్లో సుమారు 100 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జలాశయాల్లోని లైవ్ స్టోరేజీ నీటిని ఈ ఏడాది సాగునీటి కోసం వినియోగించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలి
కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సమస్యలు తలెత్తకుండా ఉపాధి హామీ పథకం కింద పనులను విస్తృతంగా చేపట్టాలని సీఎస్ సూచించారు. గత ఏడాది రోజుకు సగటున 25 వేల మంది కూలీలు పనులకు హాజరుకాగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2.5 లక్షలకు చేరిందని తెలిపారు. నెలాఖరుకు రోజువారీ కూలీల హాజరును 5 లక్షలకు పెంచేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ప్రతి గ్రామంలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు పని కల్పించేలా నీటి సంరక్షణ పనులు, చెరువులు, కుంటల్లో పూడికతీత, నీటి నిల్వ నిర్మాణాలు, ఫామ్ పాండ్స్, వ్యక్తిగత, సామూహిక సోక్ పిట్ల నిర్మాణం వంటి పనులను చేపట్టాలని సూచించారు. పశువులకు మేత అందుబాటును పెంచే పనులను కూడా ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాలని తెలిపారు.
ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించి పనులను పర్యవేక్షించాలని, ప్రతి గ్రామీణ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. అక్టోబర్ 2న గ్రామపంచాయతీల్లో రూపొందించిన ప్రత్యేక ప్రణాళికల ఆధారంగా పనులను వేగవంతం చేయాలని, మార్చి 2027 వరకు ఉపాధి హామీ పథకం ద్వారా అదనంగా రూ.6,500 కోట్ల మేర పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
సింగూరు పరిధిలో తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ప్రణాళిక
పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ మాట్లాడుతూ.. సింగూరు పరిధిలోని 19 పట్టణాలు, సుమారు 2 వేల ఆవాసాలకు తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు డిసెంబర్ 10 వరకు అవసరాలు తీర్చేందుకు సరిపోతుందని, ఆ తర్వాత కూడా సరఫరాలో ఇబ్బందులు రాకుండా రూ.110 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించామని, ఈ వారంలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని వివరించారు.
ఉపాధి హామీ పథకం ద్వారా ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు, అక్టోబర్‌లో జిల్లాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు.
ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు దేశవ్యాప్తంగా విద్యుత్ లభ్యత గణనీయంగా తగ్గుతోందని తెలిపారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల్లో గతంలో 3,750 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, ఈ ఏడాది సుమారు 930 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయిందని వివరించారు.
పగటిపూట విద్యుత్ అవసరాలను తీర్చగలుగుతున్నప్పటికీ, రాత్రి పీక్ అవర్స్‌లో కొంత కొరత ఉంటోందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. 3,000 మెగావాట్ల బ్యాటరీ నిల్వతో కూడిన సౌర విద్యుత్ ప్రాజెక్టు, 2,000 మెగావాట్ల రౌండ్-ది-క్లాక్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు, 800 మెగావాట్ల బ్యాటరీ నిల్వ ప్రాజెక్టు సహా నాలుగు ప్రధాన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
భారత వాతావరణ శాఖ నిపుణురాలు డాక్టర్ ఎ. శ్రావణి మాట్లాడుతూ ప్రస్తుతానికి తెలంగాణలో చెప్పుకోదగిన వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈశాన్య రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి ప్రసాద్, డి సి ఓ శ్రీ మాల, ఎస్సీ ఎన్పీడీసీఎల్ గంగాధర్ ,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




