Karimnagar: బడి మనది - బాధ్యత మనదే: స్వచ్ఛ పాఠశాల కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు!
Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ నెల 13న 'స్వచ్ఛ పాఠశాల' కార్యక్రమం.
Karimnagar: బడి మనది - బాధ్యత మనదే: స్వచ్ఛ పాఠశాల కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు!
కరీంనగర్ : ఈనెల 13న ‘‘స్వచ్ఛ పాఠశాల’’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిని పరిశుభ్రం చేసే కార్యక్రమానికి ఊరూవాడా తరలిరావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘బడి మనది. ఆ బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఊరూవాడా కదలి వచ్చి ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యక్రమంలో భాగస్వాములు కండి. స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు సహా ప్రతి ఒక్కరూ కదలిరండి. ముఖ్యంగా రాజకీయాలతో సంబంధం లేకుండా బీజేపీ సహా అన్ని పార్టీల నాయకులు తమ తమ జెండా, ఎజెండా, పార్టీ కండువాలను పక్కన పెట్టి స్వచ్ఛందంగా తమ తమ గ్రామాల్లోని పాఠశాలలకు ఈనెల 13న ఉదయమే తరలిరండి. ‘‘స్వచ్ఛ పాఠశాల’’ పేరుతో ఆయా పాఠశాలలను పరిశుభ్రం చేసి సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో పాల్గొనండి’’అని కోరారు.
‘‘సర్కారు బడిని కాపాడుకుంటే.. పేద, మధ్య తరగతి పిల్లల చదువుకు భరోసా కల్పించినట్లే. ఈ మహాయజ్ఝంలో ఊరూవాడా కదిలిరండి. బడిని బాగు చేసుకుందాం. మన ఊరి భవితకు బాటలు వేద్దాం.’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. మరోవైపు ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈనెల 13న చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి వెళ్లి అక్కడి పాఠశాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు.




