Karimnagar: గురువులే భావితరాల రూపశిల్పులు: కలెక్టర్ చిత్రా మిశ్రా!
Karimnagar: కలెక్టరేట్ ఆడిటోరియంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. గురువులే భావితరాల రూపశిల్పులని, కరీంనగర్‌ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.
Karimnagar: గురువులే భావితరాల రూపశిల్పులు: కలెక్టర్ చిత్రా మిశ్రా!
కరీంనగర్: గురువులే భావితరాల రూపశిల్పులని.. మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైందని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. దీనికి కలెక్టర్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఈవో చైతన్య జైనీ, విద్యాశాఖ ఏడి ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడాతూ విద్యార్థులకు పాఠశాల రెండో ఇల్లు అని.. బాల్యం నుంచే పాఠ్యాంశాలతో పాటు శుభ్రత, ధైర్యం, క్రమశిక్షణ నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మేము ఇలాంటి స్థితిలో ఉన్నామంటే మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులే కారణమని,
నా ఉన్నతికి కారణమైన ఉపాధ్యాయులను నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటానని పేర్కొన్నారు. అన్ని వృత్తుల వారిని తయారు చేసేది ఉపాధ్యాయ వృత్తి అని.. ఇలాంటి వృత్తిలో ప్రతి నిమిషం బాధ్యతగా పనిచేస్తూ రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల విద్యాసామర్ధ్యాలు పెంపొందించేందుకు FLN (ఫౌండేషనల్ లిట్రసి అండ్ న్యూమరసీ ) పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని.. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్య అందించాలని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రగతిపై మండలాల వారిగా డీటెయిల్ రివ్యూ నిర్వహించాలని పేర్కొన్నారు.
మరిన్ని సిఎస్ఆర్ నిధులు తెచ్చి పాఠశాలలను మెరుగుపరుస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఉపాధ్యాయులు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. భయంతో కాకుండా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విద్యారంగ అభివృద్ధికి పాటుపడుతున్నారని వారి తోడ్పాటును అభినందించారు.
మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. వ్యక్తి ఉన్నత స్థానంలో నిలిచేందుకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలికి తీసేలా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరపాలిక పరిధిలోని పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
సైన్స్ మ్యూజియంను ఆధునీకరించామని త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. డీఈవో చైతన్య జై ని మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని.. భాగస్వాములు అవుతున్న ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. కలెక్టర్ మార్గదర్శకత్వం మరింత స్ఫూర్తిని ఇస్తుందని వివరించారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం మాట్లాడుతూ పుస్తక పఠనం కోసం విద్యార్థులకు సహకారం అందిస్తూ వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యారంగంలో విశిష్ట సేవలందించిన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం సెక్రటరీ భగవంతయ్య, స్పెషల్ అధికారులు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, దాసి శ్రీనివాస్, మహేందర్, జీ సీడీఓ ఉమారాణి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, ఎంఈఓ లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




