Karimnagar: సీసీఐ నిబంధనలు సడలించి పత్తికి రూ.15 వేల మద్దతు ధర ఇవ్వాలి!
Karimnagar: పత్తి దిగుబడి తగ్గినందున సీసీఐ నిబంధనలు సడలించి, క్వింటాలుకు రూ.15,000 మద్దతు ధర చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం నాయకుడు వర్ణ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
Karimnagar: సీసీఐ నిబంధనలు సడలించి పత్తికి రూ.15 వేల మద్దతు ధర ఇవ్వాలి!
Karimnagar: ఎల్‌నినో ప్రభావంతో ఈ సంవత్సరం పత్తి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని, సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 3 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోందని, క్వింటాల్‌కు 15000 మద్దతులను ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర ప్రభుత్వ విధానాలు మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయని విమర్శించారు.
సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతాంగాన్ని మోసం చేయడమేనని అన్నారు. పంట దిగుబడి తగ్గి, పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితుల్లో తేమ శాతం నిబంధనల పేరుతో రైతుల పత్తిని కొనుగోలు చేయకపోవడం అన్యాయమన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే సీసీఐ కొనుగోలు నిబంధనలను సడలించి 15 శాతం వరకు తేమ ఉన్న పత్తి ఉత్పత్తులను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అమలులో ఉన్న పత్తి కనీస మద్దతు ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రైతులకు పెట్టుబడులపై తగిన ఆదాయం లభించడం లేదన్నారు. అందువల్ల పత్తికి క్వింటాలుకు రూ.15,000 కనీస మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభమైనప్పటికీ నేటి వరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక్క క్వింటా పత్తిని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సీసీఐ వెంటనే కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి, రైతుల నుంచి ఎలాంటి షరతులు, ఇబ్బందులు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని కోరారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం వల్ల విదేశాల నుంచి తక్కువ ధరకు పత్తి దిగుమతి అవుతోందని, దీంతో దేశీయంగా పత్తి పండిస్తున్న రైతులకు సరైన ధర లభించడం లేదని పేర్కొన్నారు. దేశీయ పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే దిగుమతి సుంకాలను తిరిగి విధించడంతో పాటు అవసరమైన మేరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఒకవైపు దేశీయ రైతులను పత్తి సాగు చేయాలని ప్రోత్సహిస్తూ, మరోవైపు విదేశీ పత్తి దిగుమతులకు అవకాశం కల్పించడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలకు నిదర్శనమన్నారు.
అలాగే కప్పాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి విక్రయాలకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆచరణాత్మక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ యాప్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన లేని చిన్న, సన్నకారు రైతులు యాప్ నిబంధనల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, పత్తి విక్రయ ప్రక్రియను సరళతరం చేసి రైతులకు నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే అవకాశం కల్పించాలని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, రైతులకు అండగా ఉంటామని చెబుతూ ఆచరణలో రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ నీతిని గ్రామగ్రామాన రైతాంగం ఐక్యంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల వాస్తవ పరిస్థితులను గుర్తించి సీసీఐ నిబంధనలను సడలించాలని, 15 శాతం తేమ వరకు పత్తిని కొనుగోలు చేయాలని, క్వింటాలుకు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని, పత్తి దిగుమతి సుంకాన్ని తిరిగి విధించాలని, కప్పాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేయాలని వర్ణ వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ రైతాంగం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి,జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము, మండల అధ్యక్ష కార్యదర్శులు కాయిత లింగారెడ్డి, శీలం అశోక్, జిల్లా కమిటీ సభ్యులు తిప్పర బోయిన శ్రీకాంత్, కెవిపిఎస్ ఉపాధ్యక్షులు వడ్లూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.




