Karimnagar: ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ డీడీ కేసుల్లో అవినీతి గుట్టురట్టు!

Karimnagar: కరీంనగర్‌లో డ్రంకెన్ డ్రైవ్ కేసును అక్రమంగా డిస్పోజ్ చేసిన ఆర్ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 July 2026 9:57 AM IST
Karimnagar
X

Karimnagar: ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ డీడీ కేసుల్లో అవినీతి గుట్టురట్టు!

Karimnagar: ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో జరిగిన అంతర్గత విచారణలో భాగంగా, మే 19న పద్మనగర్‌కు చెందిన బేతి రాజేందర్ (50) అనే వ్యక్తి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఆర్ఎస్సై శ్రీకాంత్‌కు పట్టుబడ్డాడు. అయితే నిందితుడు కోర్టుకు హాజరుకాకుండానే కేసు డిస్పోజ్ అయినట్లు తేలింది.

ఈ కేసుకు సంబందించిన పూర్తి వివరాలు సేకరించి అట్టి నివేదికను డి ఐ జి కి సమర్పించామన్నారు. ఈ నివేదిక ఆధారంగా , నిందితుడి నుండి పదిహేను వేల రూపాయలు లంచంగా తీసుకుని, ఆర్ఎస్సై శనిగల శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ కె. సాయి కృష్ణ మరియు డీడీ డిస్పోసల్ స్టేషన్ కానిస్టేబుల్ ఎన్. కిరణ్‌లు కలిసి డూప్లికేట్ ఎస్టీసీ (Summary Trial Case) నంబర్ ను పోలీస్ సైట్‌లో నమోదు చేసి కేసును అక్రమంగా డిస్పోజ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో , సీపీ పంపించిన నివేదిక ఆధారంగా వారి ముగ్గురిపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే డిఐజి సస్పెన్షన్ వేటు వేశారని సీపీ స్పష్టం చేశారు.

ఈ కేసు అనంతరం కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ తో పాటు ఇతర పోలీసు స్టేషన్లలో నమోదు అయిన డ్రంకెన్ డ్రైవ్ (DD) కేసుల్లో సమగ్ర విచారణ కొనసాగుతోందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం తెలిపారు. 2025 జనవరి నుండి 2026 జూన్ 30 వరకు నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఈ ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో విచారణలో తేలిన విషయాలు:

​113 కేసులలో డూప్లికేట్ లేదా రిపీటడ్ ఎస్ టి సి నంబర్లను గుర్తించారు. అయితే వాటిల్లో 13 కేసుల్లో మాత్రం అవినీతి జరిగినట్లు అధికారుల విచారణ లో వెల్లడైందన్నారు.

03 కేసులు: నిందితులు కోర్టుకు హాజరుకాకుండానే చెరో ఒకరు ₹6,000, ₹3,000, ₹1,000 చొప్పున జరిమానా చెల్లించినట్లు చూపించి కేసులను తప్పుగా డిస్పోజ్ చేశారు.

10 కేసులు: కోర్టు విధించిన జరిమానా కంటే నిందితుల నుంచి మొత్తం ₹9,700 అదనంగా లంచంగా వసూలు చేశారు.

మిగిలిన 100 కేసుల్లో నిందితులు కోర్టులో హాజరై జరిమానా చెల్లించినప్పటికీ , కోర్టు రికార్డుల్లో పలు కేసులకు డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్ టి సి కేటాయించినట్లు విచారణలో తేలిందన్నారు.

​మొత్తంగా ఇప్పటివరకు జరిగిన విచారణలో 14 కేసుల్లో ₹34,700 మేర అవినీతి జరిగినట్లు తేలిందని, మీడియా కథనాల్లో వస్తున్నట్లు ₹30 లక్షల అవినీతి జరిగిందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సీపీ స్పష్టం చేశారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు.

​వాహనదారులకు సీపీ విజ్ఞప్తి:

​"డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన నిందితులను సంబంధిత పోలీసు స్టేషన్ కోర్టులో హాజరు పరుస్తారని , కోర్టు విధించిన జరిమానాను నేరుగా కోర్టు సిబ్బందికే చెల్లించాలి. అట్టి రశీదును సంబంధిత పోలీసు స్టేషన్ లో సమర్పించాలి. ఎవరైనా పోలీసులు అదనపు డబ్బులు డిమాండ్ చేసినా లేదా డబ్బులు తీసుకుని కోర్టులో హాజరు పరచకుండా డిడి కేసులను డిస్పోజ్ చేస్తామని తెలిపినా వెంటనే సీపీ కార్యాలయానికి లేదా ఏసీబీ కార్యాలయానికి సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story