Karimnagar: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కరీంనగర్‌లో పటిష్ట బందోబస్తు!

Karimnagar: కరీంనగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం దృష్ట్యా 550 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపులు సీపీ గౌష్ ఆలం ప్రకటన.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 Sept 2026 7:13 PM IST
Karimnagar
X

Karimnagar: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కరీంనగర్‌లో పటిష్ట బందోబస్తు!

కరీంనగర్: నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ (IDOC) భవన ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 30న కరీంనగర్‌కు రానున్న నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, సజావుగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు.

ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గాలు, పాత కలెక్టరేట్, నూతన IDOC పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కమిషనరేట్ పరిధి నుంచి సుమారు 550 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించారన్నారు.

కార్యక్రమ ప్రాంగణాల్లో యాక్సెస్ కంట్రోల్ అమలు చేస్తూ, అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతించనున్నారని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక మీడియా గ్యాలరీ ఏర్పాటు చేయగా, అధికారిక పాస్‌లు కలిగిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతిమ థియేటర్ నుంచి మమత థియేటర్ వరకు వాహనాల రాకపోకలను నియంత్రించి, అవసరమైన చోట్ల ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నారన్నారు. ప్రజలకు ముందస్తుగా ట్రాఫిక్ సూచనలు జారీ చేయనున్నామని తెలిపారు.

అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రిజర్వ్ బలగాలు, ప్రత్యేక బృందాలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను గమనించి, విధుల్లో ఉన్న పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN