Sircilla: స్పీకర్‌ను కంటతడి పెట్టించిన ఘనత బీఆర్‌ఎస్‌దే: కాంగ్రెస్ ఫైర్!
Sircilla: బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొడతామని పీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర స్పష్టం. స్పీకర్‌పై వ్యాఖ్యలు, దళితుల అంశంపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్.
Sircilla: స్పీకర్‌ను కంటతడి పెట్టించిన ఘనత బీఆర్‌ఎస్‌దే: కాంగ్రెస్ ఫైర్!
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడతామని అన్నారు.
బీఆర్ఎస్ నాయకులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటం, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు శాసనసభ స్పీకర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలను ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారని మేడి రవిచంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో కావాలనే కుట్రపూరిత చర్యలకు బీఆర్ఎస్ నాయకులు తెరలేపుతున్నారని ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒకే గూటి పక్షుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి ప్రజలకు తెలిసిందేనని అన్నారు. ఆ అవినీతి వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలోకి వచ్చిన వెంటనే ఆందోళనలకు దిగుతున్నారని ఆరోపించారు.
గుండాగిరి చేస్తూ, మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దళితుల పట్ల జరిగిన వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఆలోచనా విధానాలను బీఆర్ఎస్ రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని మేడి రవిచంద్ర విమర్శించారు. కేటీఆర్ నిత్యం అసత్యాలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
శాసనసభ స్పీకర్ తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా స్పీకర్‌ను కంటతడి పెట్టించిన ఘటనను ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ తరఫున సమర్థవంతంగా తిప్పికొడతామని పీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర స్పష్టం చేశారు.




