Illanthakunta: అక్రిడిటేషన్ కార్డుల జాప్యంపై జర్నలిస్టుల ఆగ్రహం!

Illanthakunta: టీయూడబ్ల్యూజే హెచ్-143 అధ్యక్షుడు లాయక్ పాషా ఆధ్వర్యంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కోసం రేపు చలో కలెక్టరేట్ ధర్నా జరగనుంది.

KALEEM, SIRICILLA
Published on: 20 July 2026 6:42 PM IST
Illanthakunta
X

Illanthakunta: అక్రిడిటేషన్ కార్డుల జాప్యంపై జర్నలిస్టుల ఆగ్రహం!

ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) ఉద్యమ కార్యాచరణను మరింత వేగవంతం చేసింది. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ మంగళవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే "చలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల ప్రెస్ క్లబ్‌లో టీయూడబ్ల్యూజే హెచ్-143 సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పాల్గొని సభ్యత్వాలను నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా అక్రిడిటేషన్ కార్డుల జారీ జాప్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.

జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్యతే బలమని, సంఘం చేపట్టే ప్రతి ఉద్యమానికి పాత్రికేయులు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పరుశురాం, జిల్లా క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రసూల్, జిల్లా కమిటీ సభ్యుడు కమటాల విజయ్, వేములవాడ ప్రధాన కార్యదర్శి అలీ, సీనియర్ జర్నలిస్టు మోహన్‌తో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఉద్యమాలకు టీయూడబ్ల్యూజే హెచ్-143 శ్రీకారం చుట్టింది. అక్రిడిటేషన్ కార్డుల జారీ వేగవంతం చేయాలనే డిమాండ్‌కు ఈ "చలో కలెక్టరేట్" కార్యక్రమం కీలక వేదికగా మారనుంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story