Karimnagar: మోదీ సభకు సిద్ధం.. బండి సంజయ్ అదిరిపోయే పిలుపు!

Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 3 May 2026 1:40 PM IST
Karimnagar
X

Karimnagar: మోదీ సభకు సిద్ధం.. బండి సంజయ్ అదిరిపోయే పిలుపు!

కరీంనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని కోరారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని జిల్లా పార్టీ నేతలకు సూచించారు.

కరీంనగర్ లోని గాయత్రీనగర్ లో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి బీజేపీ కార్పొరేటర్లతోపాటు జిల్లాలోని పార్టీ నాయకులంతా భారీ ఎత్తున తరలివచ్చారు. వారందరితో కలిసి భూమి పూజ నిర్వహించిన బండి సంజయ్ అనంతరం జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో గాయత్రి బ్యాంకెట్ హాలులో జిల్లా మండలాధ్యక్షులు, ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే సభకు రానున్న నేపథ్యంలో, బహిరంగ సభ విజయవంతం, జన సమీకరణపై ఆయా నేతలతో చర్చించారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, కోమాల ఆంజనేయులు, గుగ్గిళ్ల రమేశ్, నల్లాల ఒదేలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. 3వ సారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత హైదరాబాద్ తొలిసారి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త స్వచ్ఛందంగా తరలిరావాలి. కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో జన సమీకరణ చేద్దాం. వేలాది సంఖ్యలో ప్రజలను పరేడ్ మైదానానికి తరలిద్దాం.

బీజేపీ నాయకులంతా తమ అనుచరులు, టీంతో తప్పనిసరిగా పరేడ్ మైదానానికి తరలి రావాలి. ప్రతి ఒక్కరూ మోదీ సభకు ఆహ్వానిస్తూ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలి. మీ గ్రామాలు, వార్డులు, మండలాల పరిధిలో వాల్ రైటింగ్ రాయించండి. సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారికి తగిన రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలి. మోదీ సభ సక్సెస్ తో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం తథ్యమనే సంకేతాలు పంపుదాం.

జ్యోతినగర్ లో పలు అభివ్రుద్ది కార్యక్రమాలకు శ్రీకారం

కరీంనగర్ లోని జ్యోతినగర్ కేడీఆర్ పార్కు వద్దకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి రూ.16 లక్షల సాధారణ నిధులతో చేపట్టిన వివిధ అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేడీఆర్ పార్కు రెండో గేటు వద్ద సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story