Sircilla: సిరిసిల్లలో అధికారులకు అలర్ట్ జారీ చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
Sircilla: సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
Sircilla: సిరిసిల్లలో అధికారులకు అలర్ట్ జారీ చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల: ఎగువ మానేరు ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె బుధవారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద పరిస్థితులు, ప్రస్తుత నీటి నిల్వలపై అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందించారు. ప్రస్తుతం కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేదని, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం సుమారు 1.6 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే ప్రాజెక్టులోకి వరద నీరు చేరి పూర్తిస్థాయి నీటిమట్టం చేరే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ప్రాజెక్టు నీటిమట్టాన్ని నిరంతరం పరిశీలిస్తూ, పరిసర గ్రామాల రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఒకవేళ ప్రాజెక్టు మత్తడి పారే పరిస్థితి ఏర్పడితే వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి దయాకర్, అధికారులు ప్రశాంత్, తహసీల్దార్ మారుతి, సర్పంచ్ అర్చన తదితరులు పాల్గొన్నారు.




