Peddapalli: పెద్దపల్లి ఐడీఓసీలో మంత్రుల త్రిసభ్య కమిటీ భారీ సమీక్ష
Peddapalli: పెద్దపల్లి ఐడీఓసీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష.
Peddapalli: పెద్దపల్లి ఐడీఓసీలో మంత్రుల త్రిసభ్య కమిటీ భారీ సమీక్ష
పెద్దపల్లి: ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో చివరి గింజ వరకు మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం పెద్దపల్లి ఐడిఓసీలో నిర్వహించిన యాసంగి ధాన్యం కొనుగోళ్ల సమీక్ష సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణా రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వంతో పోలిస్తే 25 నుంచి 30 శాతం అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 8 లక్షల మంది రైతులకు రూ.11 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
15 నుంచి 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తి మద్దతు ధరతోనే కొనుగోలు చేసి బాయిలర్ మిల్లులకు తరలిస్తామని తెలిపారు. మిల్లర్లకు ఏవైనా నష్టాలు వచ్చినా ప్రభుత్వం భరిస్తుందని, రైతులకు మాత్రం నష్టం జరగనివ్వమన్నారు.
రైతుల చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గతంలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులు బకాయిలు, వడ్డీలు చెల్లిస్తే తిరిగి ధాన్యం కేటాయింపులు ఇస్తామని తెలిపారు. రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు ఇసుక రవాణా నిలిపివేసి వాహనాలను పూర్తిగా ధాన్యం రవాణాకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8575 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సుమారు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండగా, ఎఫ్‌సీఐ కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితమైందన్నారు. ఎఫ్‌సీఐ కేటాయింపులకు మించి అదనంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు.
డిసెంబర్ 2023 తర్వాత కనీస మద్దతు ధర విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తూ రైతులకు ఇప్పటివరకు అదనంగా రూ.16,479 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాల కారణంగా కేవలం 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే తడిసిందని, ఆ ధాన్యాన్ని కూడా పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే అదనపు గోదాములు అద్దెకు తీసుకుంటామని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు సార్లు ధాన్యం కొనుగోళ్లు జరిగినప్పటికీ ఎక్కడా ఒక్క కిలో ధాన్యానికి కూడా తరుగు పేరుతో కోత విధించలేదన్నారు.
జిల్లాలో ఎక్కడైనా రైతుల నుంచి ఒక్క కేజీ ధాన్యం తరుగు తీసినట్లు తెలిసినా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా మిల్లర్ల చేత రైతులకు పరిహారం ఇప్పిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున ధాన్యం పెద్దపల్లికి వస్తోందని, అందుకు అనుగుణంగా రైస్ కేటాయింపులు పెంచాలని కోరారు. రైతులను ఇబ్బంది పెట్టే మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో యాసంగిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు రూ.788 కోట్ల విలువైన 3.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. జూన్ 5 నాటికి 100 శాతం కొనుగోళ్లు పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఆన్‌లైన్ ఎంట్రీలు, ట్రక్ షీట్ జనరేషన్, రైతుల చెల్లింపుల్లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలో 6.9 లక్షల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 5.7 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగంలో ఉన్నాయని, ఇంకా 1.2 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం అందుబాటులో ఉందన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు కూడా సమర్థవంతంగా కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 22 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసి అవసరమైన నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ
యాసంగి సీజన్ లో లక్షా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 185 కోనుగోలు కేంద్రాల ద్వారా 65 వేలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పెద్ద పల్లిలో 20 వేల వరంగల్ లో 20 వేల మెట్రిక్ టన్నుల, హన్మకొండ లో 10 వేల మెట్రిక్ టన్నులు మిల్లింగ్ కొరకు పౌరసరఫరాల శాఖ అలాట్మెంట్ చేసిందని తెలిపారు.
భూపాలపల్లి జిల్లాలో హర్వెస్టింగ్ కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా జరుగుతుందని, చాలా మండలాలో ఇంకా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావాల్సి ఉందని అన్నారు. మంత్రి ఆదేశాల మేరకు 100 మట్టి, ఇసుక రవాణా వాహనాలను కూడా ధాన్యం కొనుగోళ్ల కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో స్టోరేజీ ప్లేస్ తక్కువగా ఉన్నందున ఇతర జిల్లాల మిల్లులకు కూడా ట్యాగ్ చేయాలని కోరారు. అంతకుముందు పెద్ద కలవల్ల ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య సురేష్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్ జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని కాలిందిని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి సంబంధిత అధికారులు రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.




