Karimnagar: నిరుద్యోగులను ముంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎం!

Karimnagar: ఇందిరా పార్క్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో జరిగే కొలువుల కొట్లాట మహా ధర్నా కరపత్రాన్ని కరీంనగర్‌లో వాసుదేవరెడ్డి ఆవిష్కరించి, యువతను ఆహ్వానించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 12 July 2026 10:20 PM IST
Karimnagar
X

Karimnagar: నిరుద్యోగులను ముంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎం!

కరీంనగర్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 15న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.సిపిఎం జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రాభవన్లో మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో లక్షల్లో కొలువులు ఖాళీగా ఉన్నాయని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ హామీని నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాల కోసం ప్రశ్నించే యువతకు సమాధానం చెప్పాల్సిన పాలకులు పకోడీలు బజ్జీలు వేయడం కూడా ఉద్యోగాలే అంటూ వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యతారాహితమైన వైఖరి అన్నారు.

పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖలో దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలాగే సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎం, లతోపాటు త్రిబుల్ ఐటీలు, నీట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర ఉన్నత విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వ విద్యాలయాల్లో దాదాపు 37వేల ఉద్యోగాలు భర్తీకి నోచుకోలేదన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ సెక్టార్కు అప్పగిస్తూ ఉద్యోగాలను కుదించేస్తుందన్నారు,కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై యూత్ డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేశారు.స్వయంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హైదరాబాదులో నిరుద్యోగులతో మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయి అని భరోసా ఇచ్చారన్నారు.

మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు గడుస్తున్న కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు. ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. 20వేల కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ,హాస్టల్లో మగ్గుతూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వమ్ము చేస్తుందన్నారు. నోటిఫికేషన్ రాక భవిష్యత్తుకు భరోసా లేక ఈ ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 9000 మంది పదవీ విరమణ పొందుతున్నారని,ఈ విధంగా రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు.స్వయం ఉపాధి రుణాలకు నిధులు మంజూరు చేయకుండా దరఖాస్తులు స్వీకరించి రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ, జెఎల్, డిఎల్, గ్రూప్ 1 2 3 4 తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంతవరకు నెలకు 5000 నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. ఎలాంటి వివాదాలు కోర్టు కేసులు లేకుండా వివాదాస్పదమైన జీవోలను తొలగించి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులు అన్నిటిని తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

జూలై 15న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగే మహా ధర్నాలో యువకులు, నిరుద్యోగులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని,వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్, జి రాజేశం, నాయకులు రాయి కంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, మాతంగి శంకర్, చల్ల లక్ష్మణ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story