Vemulawada: వేములవాడ రూరల్ తహశీల్దార్ ఆఫీస్‌కు ఎకరం స్థలం కేటాయింపు
Vemulawada: వేములవాడ రూరల్ తహశీల్దార్ కార్యాలయానికి మార్కెట్ యార్డులో ఎకరం స్థలం కేటాయిస్తూ తీర్మానం. మరిపెల్లి మార్కెట్‌కు రూ.3.94 కోట్లు నిధులని రొండి రాజు వెల్లడి.
Vemulawada: వేములవాడ రూరల్ తహశీల్దార్ ఆఫీస్‌కు ఎకరం స్థలం కేటాయింపు
వేములవాడ: వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం చైర్మన్ రొండి రాజు అధ్యక్షతన గురువారం మార్కెట్ కమిటీ యార్డు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కార్యదర్శి సరోజన, మరియు పాలకవర్గ డైరెక్టర్లందరూ పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు.
సమావేశం అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మాట్లాడుతూ, తమ పాలకవర్గం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం పూర్తవుతున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు, వేములవాడ రూరల్ మండల నూతన తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటు కోసం మార్కెట్ కమిటీ యార్డులో ఎకరం స్థలాన్ని కేటాయిస్తూ పాలకవర్గ సభ్యులు, సెక్రటరీ సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు.
తమకు పదవి ఇచ్చి, మార్కెట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఈ సందర్భంగా చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మార్కెట్ కమిటీకి స్వంత స్థలం లేని విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, కలెక్టర్ ద్వారా మరిపెల్లి గ్రామంలో 12 ఎకరాల విశాలమైన స్థలాన్ని కేటాయించేలా చొరవ తీసుకున్నారని కొనియాడారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో మరిపెల్లి మార్కెట్ అభివృద్ధికై రూ. 3 కోట్ల 94 లక్షల 40 వేల భారీ నిధులను మంజూరు చేయించారాని వెల్లడించారు.
గత మూడేళ్ల పాలనా కాలంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో నియోజకవర్గంలో అపూర్వమైన అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. రైతుల సంక్షేమం కోసం మర్రిపెల్లిలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు 40 ఎకరాల స్థలాన్ని కేటాయించామని తెలిపారు.
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని గోశాల కొరకు కూడా మరిపెల్లిలోనే మరో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. వీటితో పాటు గత పదేళ్లుగా మూలకుపడ్డ మరిపెల్లి రిజర్వాయర్ పనులను పునరుద్ధరించి, ఇప్పటికే దాదాపు 75 శాతం పనులను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని చెప్పారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధి కొరకు దాదాపు రూ. 250 కోట్లు మంజూరు చేయించి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనులు యుద్ధప్రాతిపదికన వేగవంతంగా సాగేలా చూస్తున్న ఘనత పూర్తిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కే దక్కుతుందన్నారు.
గత 30 ఏళ్ల కాలంలో కొందరి దొరల పాలన మరియు తండ్రీ కొడుకుల పరిపాలనలోనే నియోజకవర్గం సాగిందని, వారు చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ మూడేళ్లలోనే చేసి చూపించారని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కింది స్థాయి నుంచి వచ్చిన బీసీ ముద్దుబిడ్డ అయిన ఎమ్మెల్యే వేములవాడను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.
తమ రెండు సంవత్సరాల పాలనా కాలంలో ఇప్పటివరకు 10 పాలకవర్గ సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని చైర్మన్ తెలిపారు. ఈ సమావేశాలు మరియు మార్కెట్ విధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సాగేందుకు నిరంతరం సహకరించిన రైతులకు పూర్వపు సెక్రటరీలకు, ప్రస్తుత సెక్రటరీకి, మార్కెట్ సిబ్బందికి, టైపిస్టులకు మరియు సెక్యూరిటీ గార్డులందరికీ చైర్మన్ రొండి రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.




