Vemulawada: వేములవాడ కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
Vemulawada: వేములవాడ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచన.
Vemulawada: వేములవాడ కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
వేములవాడ: విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదువుతూ.. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వేములవాడ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం కలెక్టర్ తనిఖీ చేశారు.
తొలుత ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం పాఠశాల కిచెన్‌ను తనిఖీ చేసి కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, పప్పులు, బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఆహార పదార్థాల గడువు తేదీలను తనిఖీ చేసి, మెనూ చార్ట్ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.
విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో వారితో మాట్లాడిన కలెక్టర్.. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా? అని తెలుసుకున్నారు. విద్యార్థులకు తప్పనిసరిగా మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఇంటర్ సెకండ్ ఇయర్ సీఈసీ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్.. విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే అన్ని పాఠ్యాంశాలను ప్రణాళిక ప్రకారం చదువుతూ, ప్రశ్నాపత్రాల సాధన చేయాలని సూచించారు. నిర్దిష్ట లక్ష్యంతో విద్యాభ్యాసం చేసి.. తాము అనుకున్న కొలువులు లేదా స్వయం ఉపాధిలో స్థిరపడాలని ఆకాంక్షించారు.
అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు సూచించారు. విద్యాలయంలో అందించే పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.




