Vemulawada: చీర్లవంచ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

Vemulawada: చీర్లవంచ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన సిరిసిల్ల డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, పొగాకు వ్యతిరేక ప్రచారంపై ఆదేశాలు.

KALEEM, SIRICILLA
Published on: 5 Nov 2026 5:48 PM IST
Vemulawada
X

Vemulawada: చీర్లవంచ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్య సేవల నిర్వహణ, రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.

జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి, అర్హులైన బాలికలందరికీ టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ టీకా ప్రాధాన్యతపై బాలికలు, తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.

అదేవిధంగా జాతీయ పొగాకు రహిత యువత ప్రచార కార్యక్రమం 4.0లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో కలిగే అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ ప్రమాదాలపై ప్రజలకు వివరించాలని, ముఖ్యంగా యువత పొగాకు అలవాట్లకు దూరంగా ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాల సాధనకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA