Vemulawada: నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!

Vemulawada: రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ భీమా భరోసా కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. నవంబర్ 19 నుంచి ఈ పథకం ప్రారంభం.

BABU, VEMULAWADA
Published on: 11 Nov 2026 8:35 AM IST
Vemulawada
X

Vemulawada: నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో వీవో సంఘం నూతన భవన నిర్మాణానికి మంగళవారం ఆది శ్రీనివాస్ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందించిందని, అనంతరం వడ్డీలేని రుణాల విధానాన్ని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ప్రస్తుతం మహిళా సంఘాలకు రూ.67 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఒక్కో సంఘానికి రూ.20 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం కల్పిస్తూ ఎలాంటి పూచీకత్తులు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నామని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆది శ్రీనివాస్ వెల్లడించారు. కేవలం భూమి ఉన్న రైతులకే కాకుండా భూమిలేని నిరుపేద కుటుంబాలకు సైతం బీమా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి అర్హులైన కుటుంబాలను పథకంలో చేర్చుతారని చెప్పారు.

గత ప్రభుత్వాలు రాష్ట్రంపై భారీగా అప్పుల భారం మోపినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ గతంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA