Vemulawada: సర్దాపూర్ మార్కెట్ యార్డులో రూ.1.30 కోట్లతో అభివృద్ధి విప్
Vemulawada: సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.30 కోట్లతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
Vemulawada: సర్దాపూర్ మార్కెట్ యార్డులో రూ.1.30 కోట్లతో అభివృద్ధి విప్
వేములవాడ: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఆదివారం సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు తమ పంటలను భద్రంగా మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించేందుకు అవసరమైన సౌకర్యాలను దశలవారీగా కల్పిస్తున్నామని తెలిపారు.
రూ.1.30 కోట్లతో నిర్మించనున్న ప్రహరీ గోడ పూర్తయిన తర్వాత మార్కెట్ యార్డు భద్రత మరింత బలోపేతం అవుతుందని, మార్కెట్ నిర్వహణ కూడా సమర్థవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, హమాలీలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రైతు సంక్షేమానికి అవసరమైన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ వేలుమల స్వరూప తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసయ్య గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




