Vemulawada: వేములవాడలో వీరభద్ర ఆలయానికి శంకుస్థాపన.. సత్రం ప్రారంభం
Vemulawada: వేములవాడలో వీరభద్ర స్వామి ఆలయానికి విప్ ఆది శ్రీనివాస్, శ్రీశైలం జగద్గురువు శంకుస్థాపన; వీరశైవ అన్నదాన సత్రం ప్రారంభం, రాజన్న ఆలయ వివరాలు.
Vemulawada: వేములవాడలో వీరభద్ర ఆలయానికి శంకుస్థాపన.. సత్రం ప్రారంభం
వేములవాడ: వేములవాడ పట్టణంలో రెండో బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించనున్న వీరభద్ర స్వామి ఆలయానికి శ్రీశైలం జగద్గురువు చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామీజీ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో భక్తుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆలయ ప్రాచీనత, చారిత్రక వైభవం, ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. హెరిటేజ్ కన్సల్టెంట్లు, శృంగేరి పీఠం పెద్దలు, ఆధ్యాత్మిక నిపుణుల సూచనలు, సలహాలు, నిబంధనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ప్రధాన ఆలయ నిర్మాణాన్ని, గర్భాలయాన్ని ఎక్కడా తాకకుండా చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గతంలో శిలామయంగా ఉన్న ఆలయ శిఖరాన్ని 1970వ దశకంలో మార్చిన నేపథ్యంలో, ఇప్పుడు తిరిగి శిలామయ పద్ధతిలో ప్రత్యేకంగా శిఖర నిర్మాణం చేపట్టాలనే ఆలోచనకు వచ్చినట్లు వివరించారు. ప్రాచీన ఆలయ సంప్రదాయాలను పరిరక్షిస్తూనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
భక్తుల దర్శనాలు, నిత్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భీమేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు కలగకుండా సుమారు రూ.6.50 కోట్లతో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి సహకారం
వేములవాడ క్షేత్రంలో వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి వీరశైవ సంఘం నాయకులు, సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని ఆది శ్రీనివాస్ అన్నారు. సనాతన ధర్మం, హైందవ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లోకకల్యాణం కోసం వివిధ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక సంస్థలు నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు, ధార్మిక సేవలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.
వీరశైవ సంఘం ప్రతినిధులు వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి సహకారం కోరిన నేపథ్యంలో, వేములవాడ క్షేత్రం తరఫున తన వంతు సహకారం, సేవా రూపంలో అందిస్తానని హామీ ఇచ్చారు. భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షలకు వేములవాడ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని తెలిపారు.
వేములవాడ రాజన్న క్షేత్రానికి ప్రతిరోజూ వేలాది మంది, లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అన్ని కులాలకు చెందిన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో అన్నదాన సత్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ముఖ్యంగా సోమవారం రోజున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసుకునే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
వేములవాడ రాజన్న క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా మరింత వైభవోపేతంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ స్పష్టం చేశారు.




