Vemulawada: రాజన్న ఆలయ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి
Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
Vemulawada: రాజన్న ఆలయ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. పనుల ప్రణాళిక ప్రకారం ఒక్కో పనికి ప్రత్యేక గడువు విధించి ముందుకు సాగాలని, పనుల వేగానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు.
వేములవాడ పట్టణంలోని భీమేశ్వర స్వామి ఆలయ అతిథి గృహంలో శనివారం వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ రాజేశ్వర్ రెడ్డి, ఆర్కిటెక్ట్, ధార్మిక సలహాదారుతో కలిసి ఇప్పటివరకు పూర్తయిన పనులు, కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.
అనంతరం అధికారులతో కలిసి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలిస్తూ, అవసరమైన మార్పులు, వేగవంతమైన నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అన్ని అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రతి పనికి గడువు నిర్ణయించి, నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సమావేశంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కేఎస్బీ కుమారి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లా నాయక్, స్థపతులు జయేంద్రన్, గణేష్, స్ట్రక్చర్ ఇంజినీర్ శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.




