Thangallapalli: నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్ సాధ్యం.. యువత కీలక పాత్ర పోషించాలి!
Thangallapalli: తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం మై భారత్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యువ సంవాద్ కార్యక్రమం నిర్వహించారు.
Thangallapalli: నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్ సాధ్యం.. యువత కీలక పాత్ర పోషించాలి!
రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లిలోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేరా యువ భారత్ (మై భారత్) రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యువ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను వికసిత్ భారత్@2047 లక్ష్యంతో అనుసంధానించడంతో పాటు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మై భారత్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. "నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్" అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు.
కార్యక్రమంలో యూత్ ఐకాన్ కుమారి శ్రీనిత్య వికసిత్ భారత్@2047 లక్ష్యంపై తన అభిప్రాయాలను, భారతదేశ అభివృద్ధి ప్రస్థానాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. పేదరిక నిర్మూలన, సామాజిక-ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అవసరమని వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ, సామాజిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ ఐకాన్ ప్రశాంత్ తన జీవిత ప్రయాణం, క్రీడారంగంలో ఎదురైన అనుభవాలను విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపారు. విద్యార్థులు ప్రముఖులతో ముఖాముఖి ముచ్చటిస్తూ వారి అనుభవాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జైనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, అతిథులు భారత రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా పఠించారు. రాజ్యాంగ విలువలు, పౌర బాధ్యతలు, దేశ నిర్మాణంలో యువత పాత్రపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మై భారత్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి జి. కిరణ్ కుమార్, యూత్ ఐకాన్ కుమారి శ్రీనిత్య, స్పోర్ట్స్ ఐకాన్ ప్రశాంత్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రహేనా, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ నవ్య, మై భారత్ వాలంటీర్ లోపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.




