Wanaparthy: వనపర్తిలో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' సదస్సు

Wanaparthy: వనపర్తి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 2 May 2026 5:16 PM IST
Wanaparthy
X

Wanaparthy: వనపర్తిలో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' సదస్సు

Wanaparthy: ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివని, రెండింటిని సమానంగా ముందుకు తీసుకుపోవడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జెడ్పి సీఈవో యాదయ్య, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.

కార్యక్రమానికి ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధి పొందుతున్న వారి వివరాలను తెలియజేసారు.

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణ మాఫీ పథకం ద్వారా 29,455 మంది రైతులకు రూ. 201 కోట్ల లబ్ది చేకూర్చడం జరిగింది అన్నారు. రైతు భరోసా కింద 83,964 మంది రైతులకు రూ. 91 కోట్ల పెట్టుబడి సాయం అందించమన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 26,678 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి,

రూ. 286 కోట్లు వారి ఖాతాల్లో వేసినట్లు తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో 74,846 రేషన్ కార్డులు ఉండగా వాటిలో 35,837 కార్డులు ప్రజా ప్రభుత్వం లో కొత్తగా జారీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గం లో 30,812 లబ్ధిదారులకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించి కరెంటు బిల్లుల భారం తగ్గించిందాన్నారు. అదేవిధంగా నియోజకవర్గం లో మొత్తం 3978 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంతం ఇంటి కల నెరవేర్చమన్నారు.

నియోజకవర్గం లో మొత్తం 4600 స్వయం సహాయక సంఘాలకు రూ.14 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళలకు 50,617 ఏక రూప చీరలు, 27,566 మందికి చేయూత పెన్షన్ లు అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు.

ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇప్పటికే మనం గ్రామస్థాయి మండల స్థాయి సభలను నిర్వహించుకున్నామని, ప్రస్తుతం నియోజకవర్గస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని త్వరలోనే జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి కార్యక్రమాలను కూడా జూన్ రెండవ తేదీన విజయవంతంగా నిర్వహించుకుందామని తెలిపారు.

ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత, ఫైల్స్ క్లియరెన్స్, అరైవ్ అలైవ్, ఆరోగ్య వారోత్సవాలు వంటి అంశాలను పూర్తి చేసుకుని ప్రజల లోపల ఆరోగ్యం పై, రహదారి భద్రతపై, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వానికి సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళ లాంటివని రెండింటిని సమానంగా ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ మహమ్మారి పెద్ద సవాలుగా మారిందని పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.

విద్యకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనంతో పాటు రాబోయే రోజుల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నారని ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే పంపాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఆయిల్ పామ్, మొక్కజొన్న తో పాటు ఇతర పంట మార్పిడి వైపు మొగ్గు చూపాలని సూచించారు.

యువత ఎక్కువ శాతం క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు. చదువుకొని వారందరికీ రాత్రిపూట బడులు నిర్వహించి విద్య నేర్పాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ప్రస్తుతం జిల్లాలో 24 శాతానికి పైగా వృక్ష సంపద ఉందని అది 33 శాతానికి పెంచడానికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా రైతులు కేవలం ఒకటే వరి పంట పైన ఆధారపడితే సరిపోదని, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న పంటను వేసేందుకు పరిగణనలోకి తీసుకోవాలని పంట మార్పిడిని అలవాటు చేసుకోవాలని సూచించారు.

ఇకపోతే ఉద్యాన శాఖ అధికారులు ఉచితంగా కూరగాయల విత్తనాలు సరఫరా చేస్తున్నారని అట్టి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలు తమ ఇళ్ల వద్ద కూరగాయల సాగు చేసే విధంగా అలవాటు చేసుకోవాలన్నారు. ఉద్యోగాల విషయానికొస్తే ప్రభుత్వం ఇప్పటికే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల కింద సి టీ స్కాన్ యంత్రాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇట్టి సౌకర్యాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పనులు చేస్తే ఐదేళ్లలో ప్రతి గ్రామం మంచి అభివృద్ధి మార్గంలో పయనిస్తుందని తెలియజేశారు.

ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేయడంలో బాగా పనిచేస్తున్న అధికారులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాధికారులకు సిబ్బందికి ప్రతి నెల ఒకటో తారీకు నుంచి జీతాలు చెల్లిస్తుందని తెలియజేశారు.

పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకం మహిళా శక్తి పథకంపై చేశారని తెలిపారు. తద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు మహిళా శక్తి పథకం కోసం మహిళల ప్రయాణం కోసం ఖర్చుపెట్టిందన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటును గృహ జ్యోతి పథకం కింద ప్రభుత్వం పేదలకు అందించి పేదలకు కరెంటు కష్టాలు తీర్చిందని తెలిపారు. అదేవిధంగా గత పది సంవత్సరాలలో ఎన్నడూ ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని,

రేవంతన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వనపర్తి నియోజకవర్గం లో 35 వేల కొత్త రేషన్ కార్డులను అందించామని తెలిపారు. తద్వారా రైతు భరోసా పెట్టుబడి సాయం కింద గతంలో ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తే, ఇప్పుడు దాన్ని ఎకరాకు 12 వేల రూపాయలకు పెంచామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో 15 బస్సులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల ఏర్పాటు బాధ్యతలు మహిళలకు అప్పజెప్పడం జరిగిందన్నారు.

ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. వనపర్తి లో ఇప్పటికే కేంద్రీయ విద్యాలయ స్కూల్ మంజూరు కావడం జరిగిందని, రాబోయే రోజుల్లో నవోదయ విద్యాలయాన్ని కూడా వనపర్తికి మంజూరు చేసే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క పూరి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని, తద్వారా పేదల సొంతయింటి కల నెరవేరుస్తోందని తెలిపారు.

వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ పరిధిలో రహదారుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వనపర్తి లో 70 కోట్ల రూపాయలతో అందరికీ మంచినీటి సౌకర్యం అందించేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. పెబ్బేరులో 25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వనపర్తి పట్టణానికి తలమానికంగా ఉన్న రాజా బంగ్లాను, హాస్టల్లో 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్రీడా శాఖ చొరవతో శ్రీనివాసపూర్ సర్వేనెంబర్ 55 లో స్పోర్ట్స్ పాఠశాల మంజూరు చేసినట్లు తెలిపారు.

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపట్టిందని, రైతు భరోసా, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం 16 గంటల శ్రమిస్తున్నారని, ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు.

ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇవి ప్రజలకు క్షేత్రస్థాయిలో చేరడం లేదని, వీటిని క్షేత్రస్థాయిలో ఇవన్నీ ప్రజలకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని, గతంలో ఏ ప్రభుత్వం కూడా మహిళల కోసం ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. వనపర్తి నియోజకవర్గం లో 14 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజలు రైతుల వద్దకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.

ఇక రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలో యువత ఆడుకోవడానికి వీలుగా ఒక క్రికెట్ కిట్ అందజేయబోతున్నామని తెలిపారు. ప్రజలందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అన్ని సంక్షేమ పథకాలను అందజేయడమే లక్ష్యమని, ఎవరికి ఏ పథకం అందకపోయినా, ప్రజలు నేరుగా అధికారుల వద్దకి లేదా తమ వద్దకి వచ్చి అడిగి పథకాల లబ్ధిని పొందవచ్చు అని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ బీమా పథకాన్ని అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా యువతకి ఉపాధి బాటలు వేస్తోందని తెలిపారు. ఈ సందర్బంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నిర్వహించిన అరైవ్ అలైవ్, ఆరోగ్య వారోత్సవాలు, వ్యవసాయం, గ్రామీణభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రుణాల పంపిణీ, ఉద్యాన శాఖ కార్యక్రమాలపై అధికారులు వివరాలను తెలియజేసారు.

కార్యక్రమం అనంతరం ఫంక్షన్ హాల్ ఆవరణలో జిల్లా పోలీసు శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా ఉద్యాన శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వారు చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్ ను ముఖ్య అతిథులు సందర్శించి తిలకించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ. 313 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాల రెండు సంవత్సరాల సంబంధించిన చెక్కును, స్వయం సహాయక సంఘాలకు రూ.12.32 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు చెక్కును ముఖ్య అతిథులు అందజేశారు.

వనపర్తి మండల మహిళా సమాఖ్య విక్కీ పౌల్ట్రీ యూనిట్ కోసం రూ. 3 లక్షల చెక్కును, మండల మహిళా సమాఖ్యలకు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎన్ ఆర్ ఎల్ ఎం గ్రాంట్ కింద రూ. 5.97 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. గ్రామ సంఘాలకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ. 4.42 కోట్ల కమిషన్ చెక్కును అందజేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.

కార్యక్రమం లో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, పెబ్బేరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, సిపిఓ హరికృష్ణ, డిఆర్డిఓ ఉమాదేవి, జిల్లా స్థాయి అధికారులు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY

Next Story