Tangallapalli: కేసీఆర్ నగర్‌లో మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన వైనం!
Tangallapalli: తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో మహిళల ఆందోళన.
Tangallapalli: కేసీఆర్ నగర్‌లో మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన వైనం!
Tangallapalli: తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో మౌలిక వసతుల సమస్యలపై మహిళలు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. కాలనీ గేట్‌కు తాళం వేసి, ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
కేసీఆర్ నగర్ కాలనీలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో కుటుంబాలన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తాగునీటి సమస్యతో పాటు కాలనీలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, వీధి దీపాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు కూడా ప్రజలను వేధిస్తున్నాయని పేర్కొన్నారు.
పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని మహిళలు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు కాలనీ గేట్‌కు తాళం వేసి, ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మహిళలు, "కేసీఆర్ నగర్ అనే పేరు ఉండటమే తమ కాలనీపై నిర్లక్ష్యానికి కారణమైందా?" అని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఉండడం కంటే సిరిసిల్లలో అద్దె ఇంట్లో ఉండడమే మేలని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని మహిళలు హెచ్చరించారు.




