Karimnagar: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి: యాదగిరి సునీల్ రావు

Karimnagar: కరీంనగర్‌లో సిబ్స్ బ్యూటీ అకాడమీ సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు బీజేపీ నేత యాదగిరి సునీల్ రావు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 27 Sept 2026 5:04 PM IST
Karimnagar
X

Karimnagar: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి: యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ : సక్సెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్స్ బ్యూటీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్టిఫికేషన్ ప్రదానోత్సవ కార్యక్రమం కరీంనగర్ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ గత పదేళ్లుగా స్వప్న సిబ్స్ SIBS ఇనిస్టిట్యూట్ ద్వారా దాదాపు 2,500 మందికి పైగా మహిళలకు బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ ఇచ్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి స్వయం ఉపాధి పొందేలా తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. మహిళలు తాము ఎంచుకున్న వృత్తిపై నమ్మకంతో, ధైర్యంతో ముందుకెళ్లినప్పుడే ఆశించిన విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గతంలో 1982 ప్రాంతంలో బ్యూటీ రంగాన్ని ప్రారంభించినప్పుడు సమాజంలో పలువురు చిన్నచూపు చూసినప్పటికీ, పట్టుదలతో శ్రమించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహనీయుల విజయాన్ని ఈ సందర్భంగా ఉదాహరణగా గుర్తుచేశారు.

ఏ రంగంలోనైనా రాత్రికి రాత్రే లేదా కొద్ది నెలల్లోనే గొప్ప విజయాలురావు అని, నిరంతర శ్రమ, ఓర్పు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం నేర్చుకునే తత్వం ఉండాలని స్పష్టం చేశారు. స్వప్న రావు ఈ శిక్షణా కార్యక్రమాలను పట్టణాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించి, అక్కడ ఉన్న మహిళా సోదరీమణులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. నేటి రోజుల్లో పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా సమాచార సాంకేతికత విస్తరించినందున, ప్రతి ఒక్కరూ లేటెస్ట్ ట్రెండ్స్ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.

ఒక కుటుంబం ఆనందంగా ఉండాలన్నా, పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దబడాలన్నా మహిళా సాధికారత అత్యంత కీలకమని, ప్రతి విజయం వెనుక మహిళల పాత్ర అపారమైనదని కొనియాడారు. ఇనిస్టిట్యూట్ లో సర్టిఫికెట్లు పొందిన మహిళలందరూ తాము నేర్చుకున్న విద్యను సద్వినియోగం చేసుకుంటూ సొంతంగా బ్యూటీ పార్లర్లు, సంస్థలు స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సిబ్స్ నిర్వాహకురాలు స్వప్న రావు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, డాక్టర్ పద్మజ, సిబ్స్ ప్రతినిధులు, సభ్యులు, మరియు పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN