Sircilla: రక్తహీనత రహిత భారత్ కోసం సమన్వయం అవసరం: ఏంజెలా ఆల్ఫ్రెడ్
Sircilla: అనీమియా ముక్త్ భారత్ లక్ష్య సాధనకు వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ పిలుపునిచ్చారు.
Sircilla: రక్తహీనత రహిత భారత్ కోసం సమన్వయం అవసరం: ఏంజెలా ఆల్ఫ్రెడ్
సిరిసిల్ల: రక్తహీనత రహిత భారత్ లక్ష్య సాధనకు వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ సూచించింది. అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా రక్తహీనత నివారణ, గుర్తింపు, చికిత్సా విధానాలపై వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణలో పోషకాహార లోపం, ఇతర కారణాలతో వచ్చే రక్తహీనతను గుర్తించడం, వాటి కారణాలు, లక్షణాలు, అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సా విధానాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స అందించడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని వివరించారు.
గర్భిణులు, బాలింతలు వైద్యుల సూచనల మేరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. ఐరన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, పప్పుధాన్యాలు, ఇతర పోషకాహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
అవసరమైన సందర్భాల్లో హీమోగ్లోబిన్ స్థాయి, రక్తహీనత తీవ్రత, రోగి ఆరోగ్య పరిస్థితి, నోటి ద్వారా తీసుకునే ఐరన్ చికిత్సకు స్పందన ఆధారంగా వైద్యుల పర్యవేక్షణలో సిరల ద్వారా ఐరన్ చికిత్స అందించే విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈ చికిత్సను తగిన వైద్య సూచనలు ఉన్నప్పుడే, అవసరమైన భద్రతా ప్రమాణాలతో నిర్వహించాలని వివరించారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో రక్తహీనత కేసులను ముందస్తుగా గుర్తించడం, అవసరమైన పరీక్షలు నిర్వహించడం, చికిత్స అందించడం, చికిత్స అనంతరం ఫాలోఅప్ చేయడం వంటి చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది క్షేత్రస్థాయిలో సిబ్బందికి మార్గదర్శకత్వం అందిస్తూ గర్భిణులు, బాలింతలు సహా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఆరోగ్య సేవలు అందేలా కృషి చేయాలని తెలిపారు. రక్తహీనత నివారణ ద్వారా తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, పీఓఎంసీహెచ్ డాక్టర్ నాగేంద్రబాబు, వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




