Karimnagar: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా శిబిరాన్ని పరిశీలించిన సునీల్ రావు!
Karimnagar: కరీంనగర్‌లో రూ. 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరాన్ని శుక్రవారం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
Karimnagar: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా శిబిరాన్ని పరిశీలించిన సునీల్ రావు!
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' (రూ. 5 లక్షల జీవిత బీమా పథకం) దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కరీంనగర్ నగరంలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సంబంధిత నమోదు శిబిరాన్ని సందర్శించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, నిబంధనలపై అధికారులను అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ. 5 లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
కుటుంబాన్ని పోషించే 18 నుండి 59 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ఈ బీమాకు అర్హులని, వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డు ప్రతిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సమీపంలోని మున్సిపల్ కార్యాలయంలో లేదా వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినుద్దీన్, ఆర్ఐలు కలీముల్లా ఖాన్, కొత్తకొండ శ్యామ్ సుందర్, వార్డు ఆఫీసర్ పారిపెల్లి రాజు, జవాన్ నాగరాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.




