Yellareddypet: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు: సిఐ!

Yellareddypet: సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట సీఐ ఓదెల వెంకటేష్ హెచ్చరించారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Oct 2026 11:53 PM IST
Yellareddypet
X

Yellareddypet: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు: సిఐ!

ఎల్లారెడ్డిపేట: సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఓదెల వెంకటేష్ హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ వాట్సాప్ గ్రూపుల్లో మతపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యే వీడియోలు, ఫేక్ మెసేజ్‌లు, అభ్యంతరకర సమాచారాన్ని షేర్ చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించవద్దని సూచించారు.

ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఇతరులకు పంపడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని సిఐ తెలిపారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే, రాజకీయ ఉద్రిక్తతలకు కారణమయ్యే లేదా ప్రజల మధ్య శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, వీడియోలను ఎవరూ సృష్టించవద్దని, పోస్ట్ చేయవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రజలు ఎలాంటి ఉద్వేగాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఏదైనా సమస్య లేదా ఫిర్యాదు ఉంటే పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ఫిర్యాదులను పరిశీలించి వాస్తవాల ఆధారంగా చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని సిఐ ఓదెల వెంకటేష్ కోరారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ ఆయన వెంట ఉన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA