Illanthakunta: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లొల్లి ఎంపీడీవో ఆఫీస్ ఎదుట ధర్నా!
Illanthakunta: అసంపూర్తిగా ఉన్న 40 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులపై యువజన సంఘాల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు.
Illanthakunta: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లొల్లి ఎంపీడీవో ఆఫీస్ ఎదుట ధర్నా!
ఇల్లంతకుంట: 'రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మించిన 40 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు నీటి సరఫరా, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకులు, తలుపులు, కిటికీలు వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికీ పూర్తి కాలేదని నాయకులు ఆరోపించారు. పనులు పూర్తికాకపోయినా ఏడాది క్రితమే 40 మంది లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్స్ అందజేశారని, కానీ ఇప్పటి వరకు గృహ ప్రవేశాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు.దీంతో లబ్ధిదారులు అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలానికి వచ్చే స్థానిక ఎమ్మెల్యేకు ఈ అసంపూర్తి ఇళ్లు కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు వెంటనే నిధులు కేటాయించి మిగిలిన పనులు పూర్తి చేసి, 30 రోజుల్లోగా శ్రావణ మాసంలో లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు కల్పించాలని ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల యువజన సంఘాల అధ్యక్షుడు భేంద్రం తిరుపతి రెడ్డితో పాటు బొల్లారం ప్రసన్న కుమార్, బొల్లం రాంసాగర్, అంతగిరి అనిల్, భూమల్ల ప్రశాంత్, ఎల్లేని శ్రీనివాస్, రొండ్ల కరుణాకర్ రెడ్డి, గుగ్గిళ్ల అంజనేయులు, చిట్యాల శ్రీనివాస్, దుది శ్రీనివాస్, కేశవేని భూమేష్, ఉప్పులేటి ప్రశాంత్, ఓరుగంటి చింటూ, కొట్టేపెల్లి చందు, గొర్రె శ్రీనివాస్, బిగుళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




