Kothagudem: కొత్తగూడెంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Kothagudem: కొత్తగూడెంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరుడు చలమల శ్రీనివాసరావు విగ్రహానికి కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి నివాళులు, గిరిజన హక్కుల రక్షణకు పిలుపు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 11 Sept 2026 2:39 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Kothagudem: అటవీ సంపద పరిరక్షణతో పాటు గిరిజనుల హక్కుల రక్షణకు సమన్వయంతో పనిచేయాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ నేరాల నియంత్రణకు చర్యలు. విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొత్తగూడెం ఇల్లందు క్రాస్‌రోడ్స్ లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అమరవీరుల సంస్మరణ సభకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా ముందుగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు చలమల శ్రీనివాసరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , దేశవ్యాప్తంగా అటవీ సంపదను కాపాడే క్రమంలో ఎంతోమంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడం, వారి సేవలను భావితరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత అని అన్నారు.

అటవీ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది అటవీ సంపద సంరక్షణలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ, భద్రతా పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మౌలిక సౌకర్యాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో అటవీ నేరాలను నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. గతంలో ఒక రకమైన నేరాలు అధికంగా ఉండగా, ప్రస్తుతం సైబర్ నేరాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత నేరాలు తదితర కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, అదే విధంగా అటవీ నేరాలను అరికట్టేందుకు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అటవీ శాఖ సిబ్బంది సాంకేతికంగా మరింత సామర్థ్యం పెంచుకోవాలని అన్నారు. శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక పరికరాలు, లైటింగ్, కమ్యూనికేషన్ తదితర సౌకర్యాలతో పాటు సిబ్బందికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని తెలిపారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ సిబ్బంది కుటుంబ సభ్యుల త్యాగాలను కూడా సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కలెక్టర్ అన్నారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అటవీ సంపదను పరిరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని, కష్టపడి పనిచేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తారమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉందని, ఇక్కడి గిరిజన సమాజానికి అడవులతో ఎంతోకాలంగా సన్నిహిత సంబంధం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. కోయలు, కొండరెడ్లు తదితర గిరిజన సమాజాలు అడవులతో మమేకమై జీవిస్తున్నారని, అటవీ శాఖ మరియు గిరిజన సమాజాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం ఎంతో ముఖ్యమని అన్నారు. అటవీ సంపదను పరిరక్షించడంతో పాటు గిరిజనుల హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు .

పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ, అటవీ హక్కులు తదితర అంశాలపై అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, గిరిజన సమాజాల భాగస్వామ్యంతో అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అడవులను కాపాడటం, పర్యావరణాన్ని పరిరక్షించడం ఎంత ముఖ్యమో, అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల హక్కులను పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యతను పాటిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

అటవీ అమరవీరుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో అటవీ సంపదను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, సమాజం అండగా నిలవాలని, వారి త్యాగాలకు తగిన గౌరవం ఇవ్వాలని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్పి రోహిత్ రాజు,జిల్లా అటవీ అధికారి సిధార్డ్ విక్రమ్ సింగ్ , అటవీ శాఖ అధికారులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇతర అటవీ శాఖ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM