Sathupalli: సత్తుపల్లిలో 12 అడుగుల భారీ కొండచిలువ పట్టివేత

Sathupalli: సత్తుపల్లి పట్టణంలోని ముళ్ల తీగల ఫ్యాక్టరీ రోడ్డు వద్ద 12 అడుగుల భారీ కొండచిలువను అటవీ శాఖ అధికారులు రాత్రివేళ సురక్షితంగా పట్టుకున్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 7 Nov 2026 8:19 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లిలో 12 అడుగుల భారీ కొండచిలువ పట్టివేత

సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలోని కృషి బైపాస్ రోడ్డులో ఉన్న ముళ్ల తీగల ఫ్యాక్టరీ రోడ్డు పరిసరాల్లో సుమారు 12 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు రాత్రి సమయంలో అక్కడికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు.

కాగా, సుమారు మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలోని ఫ్లాట్ల వద్ద ఉన్న పొదల్లో కొండచిలువ సంచరిస్తున్నట్లు స్థానికులు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, మున్సిపల్ చైర్‌పర్సన్ రేహానా బేగం కమల్ పాషా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ సంబంధిత అధికారులతో మాట్లాడి జేసీబీ సహాయంతో ఫ్లాట్ల పరిసరాల్లో పేరుకుపోయిన పొదలు, ముళ్లచెట్లను తొలగించి ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. దీంతో అప్పట్లో అక్కడ సంచరిస్తున్న కొండచిలువ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

తాజాగా అదే ముళ్ల తీగల ఫ్యాక్టరీ రోడ్డు పరిసరాల్లో మరోసారి భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు రాత్రివేళ ప్రత్యేక చర్యలు చేపట్టి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా పాములు కనిపిస్తే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా దూరంగా ఉండాలని, వాటిని పట్టుకునేందుకు లేదా చంపేందుకు ప్రయత్నించకూడదని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI