Kothagudem: కొత్తగూడెంలో ఉత్సాహంగా జాతీయ క్రీడా దినోత్సవ 2కే రన్!

Kothagudem: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో 2కే రన్. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. క్రీడాకారులకు సత్కారం.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 Aug 2026 8:09 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ఉత్సాహంగా జాతీయ క్రీడా దినోత్సవ 2కే రన్!

Kothagudem: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శనివారం 2కే రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, జిల్లా క్రీడల శాఖ అధికారి పరంధామ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు నిర్వహించిన ఈ 2కే రన్‌లో క్రీడాకారులు, క్రీడా కోచ్‌లు, యువత, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.

అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, క్రీడా కోచ్‌లను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మెడల్స్ వేసి అభినందించారు.

క్రీడల్లో కొత్తగూడెం ముందంజలో ఉండాలి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా కొత్తగూడెంలో 2కే రన్‌తో పాటు క్రీడాకారుల సన్మాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆటలు, పాటలు, నృత్యాలు, సామాజిక కార్యక్రమాల్లో కొత్తగూడెం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. ప్రశాంత వాతావరణానికి కొత్తగూడెం మారుపేరుగా నిలుస్తోందన్నారు.

అన్ని రంగాల అభివృద్ధికి కృషి. కొత్తగూడెంను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. విద్య, వైద్యం, ఇరిగేషన్, రోడ్లు, క్రీడలు తదితర 29 శాఖలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం కూడా నిజాయితీగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

క్రీడలకు మౌలిక వసతుల కల్పన. హౌసింగ్ బోర్డు పరిధిలో క్రీడల కోసం 18 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు కూడా చర్యలు తీసుకున్నామని చెప్పారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సైన్స్ యూనివర్సిటీలో క్రీడా అవసరాల కోసం 60 ఎకరాల స్థలం కేటాయించేలా ఒప్పించడం జరిగిందన్నారు.

ఈ క్రీడా మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను కొత్తగూడెంలో నిర్వహించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇండోర్ స్టేడియం ఏర్పాటుపై ఆలోచన, వివిధ క్రీడల్లో శిక్షణ అందించేందుకు అవసరమైన స్థలాలను పరిశీలిస్తున్నామని, కొత్తగూడెంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ పరిధిలోని చెరువులను గుర్తించి చెరువు కట్టలపై వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దలు, పిల్లలు శారీరకంగా దృఢంగా ఉండేలా క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడా రంగంలో కొత్తగూడెం మరింత ముందంజలో నిలిచేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story