Kukkunuru: గిరిజన హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు చేయాలి!
Kukkunuru: కుక్కునూరులో ఆదివాసీ గిరిజన సంఘం 5వ మండల మహాసభ. పోడు భూములకు పట్టాలు, 1/70 చట్టం అమలైపై తీర్మానాలు, నూతన కమిటీ ఎన్నిక.
Kukkunuru: గిరిజన హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు చేయాలి!
Kukkunuru: ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం 5వ మండల మహాసభ కుక్కునూరు మండల కేంద్రంలోని ఆదివాసీ ముద్దుబిడ్డలు కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్, కుంజా బొజ్జి ప్రాంగణం, చర్చి హాస్టల్ వద్ద ఘనంగా నిర్వహించారు. మహాసభలో గతంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాలను సమీక్షించడంతో పాటు, భవిష్యత్తులో నిర్వహించాల్సిన ఉద్యమాలు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ కుక్కునూరు మండలంలోని గిరిజనుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గిరిజనులకు రక్షణ కల్పించే జి.ఓ. నెంబర్ 3ను పునరుద్ధరించాలని కోరారు.
అటవీ హక్కుల కోసం పోరాడుతున్న గిరిజనులను అటవీశాఖ అధికారులు వేధించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించడంతో పాటు, వారి భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
కమ్మరిగూడెంలో మరుగుదొడ్లు కరువు
కుక్కునూరు మండలంలోని కమ్మరిగూడెం గ్రామంలో గిరిజన కుటుంబాలకు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెల్లం రామకృష్ణ తెలిపారు. దీంతో మహిళలు, కుటుంబాలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పొలాల్లోకి వెళ్లే సమయంలో భూస్వాముల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మరుగుదొడ్లు మంజూరు చేసి నిర్మించాలని డిమాండ్ చేశారు.
గిరిజన గ్రామాల్లో తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు. గిరిజనుల భూములు, అడవులు, ఉపాధి, విద్య, ఉద్యోగాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటాలను కొనసాగించాలని మహాసభ పిలుపునిచ్చింది.గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టాలని మహాసభలో పలు తీర్మానాలు చేశారు.
29 మందితో నూతన మండల కమిటీ
అనంతరం 29 మందితో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కాక ఆనంద్, కార్యదర్శిగా శ్యామల లక్ష్మణరావు, ఉపాధ్యక్షులుగా పట్ల లక్ష్మయ్య, కొండా రవి, సారియం హరినాథ్, సహాయ కార్యదర్శులుగా కాక కిషోర్, ఇరకం నాగేశ్వరరావు, సోడే వెంకటేష్ ఎన్నికయ్యారు. మరో 21 మంది సభ్యులతో నూతన మండల కమిటీ ఏర్పడింది.
నూతనంగా ఎన్నికైన కమిటీ గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారం భాస్కర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.




