Kothagudem: ఆదివాసీల హక్కుల కోసం భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై 5 గంటల పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
Kothagudem: ఆదివాసీల హక్కుల కోసం భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఆదివాసీల హక్కులు, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది ఆదివాసీలు తరలివచ్చి జాతీయ రహదారిపై బైఠాయించడంతో సుమారు ఐదు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని, పీసా చట్టాన్ని అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, జీవో-3తో పాటు 29 జీవోల ఆధారంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.
అటవీ హక్కుల చట్టం కింద 8 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వాలని, లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే అంశంపై కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఊకే శిరీష కుటుంబానికి న్యాయం చేసి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.
కలెక్టర్ స్వయంగా వచ్చి వినతిపత్రం స్వీకరించాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం రాత్రి కలెక్టర్ చాంబర్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. డిమాండ్లను ప్రభుత్వానికి సిఫారసు చేసి, ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు పంపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ పూనెం శ్రీనివాసరావు, ఉకే రవి, వట్టం ఉపేందర్, సోయం సత్యనారాయణ, ఆరెం ప్రశాంత్, వాసం రామకృష్ణ, సోయం కన్నంరాజు, పాయం సత్యనారాయణ, రమణాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.




