Kothagudem: నల్గొండ రైతు మహాసభల విజయవంతానికి ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన!

Kothagudem: నల్గొండలో ఈనెల 15 నుంచి జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కొత్తగూడెంలో ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన నిర్వహించి రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Nov 2026 12:37 PM IST
Kothagudem
X

Kothagudem: నల్గొండ రైతు మహాసభల విజయవంతానికి ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన!

Kothagudem: నల్గొండలో ఈనెల 15 నుంచి నాలుగు రోజులపాటు జరగనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లిక్కి బాలరాజు పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం జరిగే ఈ మహాసభలకు రైతులతో పాటు రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రజలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

మహాసభల ప్రచారంలో భాగంగా సీపీఎం పాత కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో స్థానిక హెడ్ ఆఫీస్ నుంచి పాత కొత్తగూడెం బైపాస్ రోడ్డు వరకు ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలకు నల్గొండ జాతీయ మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు. ఈనెల 15న లక్షమంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, పదివేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభకు రైతాంగ హక్కుల కోసం పోరాడిన చరిత్ర ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అనేక ఉద్యమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

భూమి నుంచి రైతును వేరు చేయకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు భవిష్యత్ పోరాటాల కార్యాచరణను జాతీయ మహాసభల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. రైతు సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ఉమ్మడి ఉద్యమాలకు ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జునుమాల నగేష్, టౌన్ కమిటీ సభ్యులు ఆవుల శ్రీరాములు, నాగకృష్ణ, నాయకులు కిరణ్, ముత్తేష్, రమేష్, నాని, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM