Palwancha: త్యాగాల పునాదులపై నిర్మితమైనది ఏఐటీయూసీ
Palwancha: పాల్వంచలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Palwancha: త్యాగాల పునాదులపై నిర్మితమైనది ఏఐటీయూసీ
పాల్వంచ: కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాల పునాదులపై ఏఐటీయూసీ ఆవిర్భవించిందని, నేటికీ శ్రామిక లోకానికి కొండంత అండగా నిలుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం పాల్వంచలో ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని సుమారు 25 ప్రధాన కార్మిక అడ్డాలు, కూడళ్లలో ఎర్రజెండాలను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించి, స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్మిక సదస్సులో కూనంనేని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
దేశ స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మిక హక్కులను దెబ్బతీయడమేనని విమర్శించారు. ఈ విధానాలు కార్మికుల కంటే యజమానులు, పెట్టుబడిదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ సంపద అని, వాటి పరిరక్షణకు కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పెన్షన్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను సవరించాలని, కార్మిక సంక్షేమ బోర్డులను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. కార్మికులు సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలంటే ఐక్యతతో పోరాటాలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రానున్న రోజుల్లో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలకు కార్మిక లోకం సిద్ధం కావాలని కూనంనేని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, మేయర్ మూడ్ గణేష్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచందర్ రావు, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, ఏఎంసీ డైరెక్టర్ వాడే లక్ష్మి, జిల్లా సమితి సభ్యులు వీ. పద్మజ, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, ప్రజాసంఘాల నాయకులు, ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




