Singareni: సింగరేణిలో సమ్మె సైరన్.. జూన్ 22 తర్వాత స్తంభించనున్న గనులు
Singareni: సింగరేణిలో మళ్లీ సమ్మె సైరన్ మోగనుంది. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 22వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని రంగయ్య హెచ్చరించారు.
Singareni: సింగరేణిలో సమ్మె సైరన్.. జూన్ 22 తర్వాత స్తంభించనున్న గనులు
Singareni: సోమవారం ఉదయం కొత్తగూడెం..పీవీకే-5 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మాట్లాడుతూ.. సింగరేణి పరిస్థితి దయనీయంగా, మేడి చందంగా ఉందన్నారు. మాన్ పవర్ ఎక్కువగా ఉంది సర్ ప్లస్ కార్మికులు ఉన్నారని మేనేజ్మెంట్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.
సింగరేణిలో 43,000 మంది పనిచేస్తున్నారని, అధికారులు 2500 మంది ఉండగా, కాంట్రాక్ట్ కార్మికులు 31 వేల మంది ఉన్నట్లు తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సహనాన్ని యాజమాన్యం బలహీనతగా భావించవద్దని, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం వల్ల కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.
సింగరేణి సంస్థలో కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వాటి పరిష్కారంపై యాజమాన్యం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు.
కార్మిక సంక్షేమం, సంస్థ భవిష్యత్ అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి కీలక అంశాల కంటే రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సింగరేణి మనుగడకే ప్రమాదం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డు కేసులు, అలియాస్ పేర్ల మార్పులు, పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ తొలగింపు, సొంత ఇంటి స్థలాల కేటాయింపు, డిపెండెంట్ ఉద్యోగాల వంటి అంశాలపై అనేకసార్లు చర్చలు జరిగినప్పటికీ ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు నియామక ఉత్తర్వులు జారీ కావడం ఎఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. పోరాటం ద్వారానే ఫలితాలు సాధ్యమవుతాయని, కార్మికులు ఐక్యంగా ఉంటే మరిన్ని సమస్యలకు పరిష్కారం సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కొత్త కోల్ బ్లాకుల కేటాయింపు, కొత్త బొగ్గు గనుల ప్రారంభం, సంస్థ విస్తరణ, భవిష్యత్ తరాలకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాలపై తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఒకవైపు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని ఒత్తిడి చేస్తూ, మరోవైపు సంస్థ భవిష్యత్‌కు అవసరమైన విస్తరణ చర్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.
యూనియన్‌తో జరిగిన అధికారిక సమావేశాల్లో అంగీకరించిన అనేక డిమాండ్లు ఇప్పటికీ అమలు కాకపోవడం వెనుక రాజకీయ జోక్యమే కారణమని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం కొనసాగిస్తే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతాయని హెచ్చరించారు.
సింగరేణిలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం ఇక మౌనంగా ఉండబోదని, అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటానికి అన్ని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, కార్మికులు మద్దతు తెలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, వైస్ ప్రెసిడెంట్లు కత్తెర్ల రాములు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, ఎస్. నాగేశ్వరరావు, హుమాయూన్, పిట్ కార్యదర్శులు భూక్యా రమేష్, మధుకృష్ణ కమల్, సీనియర్ నాయకులు మండల రాజేశ్వరరావు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సందీప్,
మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ సాయి పవన్, సేఫ్టీ కమిటీ మెంబర్ రాంచందర్,నారాయణ, లాల్ సింగ్,కుమార్ రావు, సంజీవ్, మోహన్, సురేందర్ రెడ్డి, కనకయ్య,మహేష్, ముబారక్, గణేష్, సునీల్, నరేష్, విక్రమ్, సహాదేవ్, సుదీర్, బాబురావు, మదనయ్య, కోటేశ్వరరావు, సుధాకర్, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.




