Kothagudem: తాడిచర్ల-2 కోసం తొలి ఉద్యమం మాదే!
Kothagudem: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన, సమ్మె నోటీసుపై జూలై 15న ఆర్‌ఎల్‌సీ సమక్షంలో చర్చలు. కొత్తగూడెంలో ఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య ప్రెస్ మీట్.
Kothagudem: తాడిచర్ల-2 కోసం తొలి ఉద్యమం మాదే!
Kothagudem: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధన కోసం తొలి ఉద్యమం చేపట్టింది ఎఐటియుసినేనని అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు.
శుక్రవారం కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ 2013లోనే సచివాలయాన్ని ముట్టడించి అరెస్టులకు గురైన ఘనత ఎఐటియుసిదేనని అన్నారు.
ప్రస్తుతం తాడిచర్ల-2 బ్లాక్‌తో పాటు మిగిలిన బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల ఉపాధి భద్రత కోసం ఇది అవసరమని పేర్కొన్నారు.సమ్మె నోటీసుకు సంబంధించి కీలక పురోగతి చోటుచేసుకుందని, ఈ నెల 15న రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని తెలిపారు.
చర్చలు విఫలమై ఆర్‌ఎల్‌సీ ఫెయిల్యూర్ రిపోర్ట్ జారీ చేస్తే ఆగస్టులో సమ్మెకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను ప్రతి కార్మికుడికి 40% వాటా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పెర్క్స్‌పై విధిస్తున్న ఆదాయ పన్నును రద్దు చేయాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన 56వేల కోట్ల రూపాయలు వసూలు చేసి సంస్థకు నూతన ప్రాజెక్టులను తీసుకొచ్చి సంస్థ మనుగడను కాపాడాలని డిమాండ్ చేశారు.
కల్వకుంట్ల కవిత చేపట్టిన "బాయి బాట" గురించి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఇప్పుడు వారి పట్ల సానుభూతి చూపడం సమంజసం కాదన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యలను వారి కుటుంబ అవేదనలను అసెంబ్లీలో నిరంతరం ప్రస్తావించిన ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి కే. సారయ్య, కేంద్ర కార్యదర్శి వంగా వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, ఉపాధ్యక్షుడు క్రిస్టోఫర్, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్ హుమాయూన్, నాయకులు ఎర్రగాని కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, శ్రీను, సోమయ్య,తదితరులు పాల్గొన్నారు.




