Kothagudem: కార్మికుల హక్కుల సాధనకు అన్ని సంఘాలతో కలిసి పోరాటం: ఏఐటీయూసీ!

Kothagudem: కొత్తగూడెంలో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని ఏఐటీయూసీ నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ హెచ్చరించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 19 Aug 2026 11:29 PM IST
Kothagudem
X

Kothagudem: కార్మికుల హక్కుల సాధనకు అన్ని సంఘాలతో కలిసి పోరాటం: ఏఐటీయూసీ!

కొత్తగూడెం: సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సమ్మెకు వెళ్లేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

బుధవారం పీవీకే-5 భూగర్భ గని వద్ద నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో వారు మాట్లాడుతూ.. కార్మికుల పెర్క్స్‌పై విధిస్తున్న ఆదాయపన్ను సమస్యను పరిష్కరించాలని, సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం, యాజమాన్యం సహకరించాలని కోరారు. ఉద్యోగుల పేర్లలోని తప్పులను సరిచేయడంతోపాటు సింగరేణి లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.56 వేల కోట్లను వెంటనే చెల్లించాలని కోరారు.

అర్హులైన కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ అందేలా ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని సమ్మె నోటీసులో ప్రధాన డిమాండ్‌గా చేర్చి ఏఐటీయూసీ పోరాటం చేయడంతో యాజమాన్యం ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించేందుకు అంగీకరించిందని తెలిపారు. ఇది కార్మికుల పోరాట ఫలితమని పేర్కొన్నారు.

సింగరేణిలో 15 ఏళ్లుగా కొత్త గనులు ప్రారంభం కాకపోవడం వల్ల కార్మికులతోపాటు వారిపై ఆధారపడిన వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొత్త గనులు ప్రారంభించకపోతే సంస్థ ఉత్పత్తి సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

12వ వేతన బోర్డు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెరుగైన వేతనాలు, సౌకర్యాలు కల్పించేలా వెంటనే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లతో వేతన బోర్డును అనుసంధానం చేసి కార్మిక హక్కులను దెబ్బతీయడాన్ని అంగీకరించబోమన్నారు.

గనుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన ఆధునిక, నాణ్యమైన సేఫ్టీ పరికరాలను సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. సింగరేణి నుంచి ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ కార్మికుల జీతాల కోసం బ్యాంకుల నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో యాజమాన్యం వివరించాలని కోరారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై కార్మికులకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

గేట్‌ మీటింగ్ అనంతరం ఏఐటీయూసీ నాయకులు జీఎం వెంకట రమణను కలిసి పీవీకే-5 గనిలో నెలకొన్న వెంటిలేషన్ సమస్యపై చర్చించారు. కార్మికుల భద్రతకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఏరియాలోని ఇతర సమస్యలను కూడా జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ఏఐటీయూసీ సిద్ధంగా ఉందని నాయకులు తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సమ్మెను ఉద్ధృతం చేస్తామని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్య, సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, సివిల్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్, ఆఫీస్ బేరర్ నాగేశ్వరరావు, ఏరియా వర్క్‌షాప్ పిట్ కార్యదర్శి మధుకృష్ణ, జీఎం ఆఫీస్ పిట్ కార్యదర్శి సౌజన్య, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జి సాయి పవన్, సేఫ్టీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story