Sathupalli: ప్రజల ప్రాణాల కంటే బొగ్గు రవాణానే ముఖ్యమా?: హుస్సేన్ నాయక్!
Sathupalli: సత్తుపల్లి కిస్తారంలో శైలో బంకర్ కాలుష్య బాధితులను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ శనివారం కలిసి సింగరేణి అధికారులను నిలదీశారు.
Sathupalli: ప్రజల ప్రాణాల కంటే బొగ్గు రవాణానే ముఖ్యమా?: హుస్సేన్ నాయక్!
సత్తుపల్లి: ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాల కంటే బొగ్గు రవాణానే సింగరేణి సంస్థకు ముఖ్యమా? వందల ఎకరాల భూమిని సేకరించే సామర్థ్యం ఉన్న సంస్థకు జనావాసాలకు దూరంగా శైలో బంకర్ నిర్మించాలన్న ఆలోచన రాలేదా? ప్రజల నివాసాల పక్కనే బంకర్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమంటూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సింగరేణి అధికారులను నిలదీశారు.
శైలో బంకర్ నుంచి వెలువడుతున్న బొగ్గు ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిస్తారం అంబేద్కర్ నగర్, బీసీ కాలనీల ప్రజల సమస్యలను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితుల గోడు విని, సింగరేణి అధికారులతో మాట్లాడారు.
కాలుష్యంతో నరకప్రాయం
శైలో బంకర్ నుంచి వెలువడుతున్న బొగ్గు ధూళి కారణంగా ఏళ్లుగా నరకప్రాయమైన జీవితం గడుపుతున్నామని కాలనీవాసులు ఆయనకు వివరించారు. ఇళ్లు, పరిసరాలు నిత్యం బొగ్గు ధూళితో నిండిపోతున్నాయని, కాలుష్య వాతావరణంలో నివసించడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు. కాలుష్యం కారణంగా ఇప్పటివరకు సుమారు 90 మంది మృత్యువాత పడ్డారని ఆరోపించారు.
బొగ్గు ధూళి ప్రభావంతో ఇళ్లు సైతం దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను తెలుసుకున్న హుస్సేన్ నాయక్ సింగరేణి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వందల ఎకరాల భూమిని సేకరించగలిగిన సంస్థకు జనావాసాలకు దూరంగా బంకర్ నిర్మించేందుకు స్థలం లభించలేదా? ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా నివాస ప్రాంతాలకు ఇంత చేరువలో నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పరిశ్రమల నిర్వహణ పేరుతో ప్రజల భద్రతను విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
కాళ్లపై పడి వేడుకున్న బాధితులు
కాలుష్యం మధ్య బతకలేకపోతున్నామని, తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అంబేద్కర్ నగర్, బీసీ కాలనీల ప్రజలు ఆయన ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. తమను ఈ కష్టాల నుంచి కాపాడాలంటూ కాళ్లపై పడి వేడుకున్నారు. బాధితుల దీనస్థితిని చూసి చలించిన హుస్సేన్ నాయక్ వారికి ధైర్యం చెప్పారు. సమస్య పరిష్కారంలో ఇన్నాళ్లూ నిర్లక్ష్యం వహించడం బాధాకరమని పేర్కొంటూ, న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
34 రోజుల దీక్ష చేసినా ఫలితం శూన్యం
శైలో బంకర్ సమస్యపై గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు అందించినా ఫలితం లేకుండా పోయిందని బాధితులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం రెండు కాలనీల ప్రజలు 34 రోజుల పాటు నిరసన దీక్ష చేపట్టినా, హామీలతోనే కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక కాలుష్య నియంత్రణ చర్యలతో సరిపెట్టకుండా తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
బంకర్ తరలింపు.. పునరావాసమే పరిష్కారం
అనంతరం బాధితుల తరఫున రూపొందించిన వినతిపత్రాన్ని కమిషన్ సభ్యుడికి అందజేశారు. శైలో బంకర్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని, బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని కోరారు. కాలనీవాసులందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, కాలుష్య ప్రభావాన్ని అంచనా వేయాలని, ఇళ్లకు జరిగిన నష్టాన్ని పరిశీలించి తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హుస్సేన్ నాయక్ హామీ ఇచ్చారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం బాధితుల ఆవేదనను గుర్తించి స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు. బొగ్గు రవాణా, పారిశ్రామిక కార్యకలాపాల కంటే ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యమివ్వాలని, బంకర్ తరలింపు, పునరావాసంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.




