Aswapuram: అశ్వాపురం ఆలయాల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్

Aswapuram: అశ్వాపురం ఓం శక్తి, సాయిబాబా ఆలయాల్లో చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రూ.7.54 లక్షల బంగారు, వెండి సొత్తు స్వాధీనం చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 19 Nov 2026 11:05 PM IST
Aswapuram
X

Aswapuram: అశ్వాపురం ఆలయాల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్

అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓం శక్తి ఆలయం, సాయిబాబా ఆలయాల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం డిఎస్పి / ఇన్‌చార్జ్ మణుగూరు డిఎస్పి అరుణ్ కుమార్ తెలిపారు.

ఈ నెల 12, 13 తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయాల తాళాలు పగలగొట్టి అమ్మవారి మెడలోని మూడు బంగారు పుస్తెల తాళ్లను (105 గ్రాములు), వెండి కిరీటాలు, చేతులు, పాదాలు, శఠగోపం తదితర వెండి వస్తువులను దొంగిలించారు. మొత్తం 7 కిలోల 900 గ్రాముల వెండి వస్తువులతో పాటు బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.7,54,000 ఉంటుందని ఆలయ సూపర్‌వైజర్ రామకృష్ణన్ సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, డిఎస్పి పర్యవేక్షణలో సిసిఎస్ బృందం, అశ్వాపురం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఉదయం గొల్లగూడెం శివారులోని సీతారామ కెనాల్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు అశ్వాపురంలోని ఓం శక్తి, సాయిబాబా ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు.

అరెస్టయిన నిందితులు షేక్ జానీ @ జానీ షరీఫ్ – నవభారత్, పాల్వంచ (స్వస్థలం: రెడ్డిపాలెం, బూర్గంపహాడ్ మండలం); సప్కా కాంతారావు – కమ్మరిగూడెం గ్రామం, వేలేరుపాడు మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్; ఊర లింగయ్య – కొత్తపేట గ్రామం, కేతపల్లి మండలం, నల్గొండ జిల్లా.

విచారణలో భాగంగా నిందితుల గత నేర చరిత్రను పరిశీలించగా, షేక్ జానీపై 11, సప్కా కాంతారావుపై 14, ఊర లింగయ్యపై 8 చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు DSP అరుణ్ కుమార్ తెలిపారు.

ఈ కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేసిన అశ్వాపురం పోలీస్ సిబ్బంది, సిసిఎస్ బృందాన్ని డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA