Aswapuram: ఇంటర్ వ్యవస్థ రద్దు ఆలోచన విరమించుకోవాలి
Aswapuram: అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ రద్దు ఆలోచనను విరమించుకోవాలని, కళాశాలలను బలోపేతం చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.
Aswapuram: ఇంటర్ వ్యవస్థ రద్దు ఆలోచన విరమించుకోవాలి
అశ్వాపురం: అశ్వాపురం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేసే దిశగా ఆలోచనలు చేయడం విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించే చర్య అని AISF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. అశ్వాపురం మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి AISF జిల్లా సహాయ కార్యదర్శి ఇనపల్లి పవన్ సాయి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా వరక అజిత్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య అనేది ఉన్నత విద్యకు పునాది వంటిదని, లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువుల వైపు అడుగులు వేయడానికి ఈ విద్యా వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
అలాంటి విద్యా వ్యవస్థను రద్దు చేయడం లేదా దాని ప్రాధాన్యతను తగ్గించడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధానాలకు స్వస్తి పలికి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యా సంస్కరణల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును అయోమయంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకోవద్దని, విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే విద్యా విధానాలపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేయాలని AISF తరఫున డిమాండ్ చేస్తున్నామని వరక అజిత్ స్పష్టం చేశారు. విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణ కోసం AISF నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.




