Bhadrachalam: ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిరసన
Bhadrachalam: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భద్రాచలంలో కాంగ్రెస్ నిరసన.
Bhadrachalam: ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిరసన
భద్రాచలం: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు గారి శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరిమి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు.
దళితులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతిగా మారిందా? అని వారు ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.భద్రాద్రి కొత్తగూడెం మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతీరాల రవికుమార్ మాట్లాడుతూ.. దళిత సమాజానికి చెందిన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ అహంకారానికి నిదర్శనమన్నారు.
అసెంబ్లీకి రాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు సమాధానం చెప్పకుండా మీరు ఫామ్ హౌస్ లో ఉండి మీ ఎమ్మెల్సీలకు దళితులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయమని చెప్పి పంపిస్తున్నారా అని ప్రశ్నించారు.?దళిత సమాజ మనోభావాలను, రాజ్యాంగ విలువలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు తాతా మధు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీ నాయకులు రత్నం రమాకాంత్ మాట్లాడుతూ.. తాతా మధు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి దళిత ప్రజాప్రతినిధుల ఓట్లు అవసరమైన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. అదే దళిత సమాజానికి చెందిన శాసనసభ స్పీకర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.
చాట్ల రవికుమార్ మాట్లాడుతూ.. దళిత సమాజానికి చెందిన వ్యక్తి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవుల్లో ఒకటైన శాసనసభ స్పీకర్ పదవిలో కొనసాగుతున్న సమయంలో ఆయనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఒక ప్రజాప్రతినిధిని అవమానించడం మాత్రమే కాదని, యావత్ దళిత సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు.
తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, చట్టపరమైన నిబంధనల ప్రకారం పోలీసులు విచారణ జరిపి, తప్పు నిర్ధారణ అయితే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దళిత సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం” అని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.




