Bhadrachalam: జీసీసీ స్థలం కబ్జా స్వాధీనం చేసుకోవాలని మాస్ లైన్ డిమాండ్!

Bhadrachalam: భద్రాచలంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) భూముల కబ్జాపై సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆక్రమిత స్థలం వద్ద భారీ నిరసన ధర్నా.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Aug 2026 4:28 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: జీసీసీ స్థలం కబ్జా స్వాధీనం చేసుకోవాలని మాస్ లైన్ డిమాండ్!

Bhadrachalam: గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారని ఆరోపిస్తూ, ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మరియు వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆక్రమిత స్థలం వద్ద భారీ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్రమణదారులకు, అధికారుల ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు మునిగేల శివ ప్రశాంత్ . గోండువానా రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తిగా ఉంటూ, గిరిజనుల సంక్షేమానికి, వారి ఆర్థిక ప్రగతికి ఎంతగానో ఉపయోగపడాల్సిన జీసీసీ విలువైన స్థలాలు కళ్లముందే.

అన్యాక్రాంతమవుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతుంటే సంబంధిత యంత్రాంగం చూసీచూడనట్లు చోద్యం చూడటం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.ఈ భూ ఆక్రమణల వ్యవహారంపై స్థానిక భద్రాచలం శాసనసభ్యులతో పాటు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (పీవో) తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, ఆక్రమణకు గురైన జీసీసీ స్థలాన్ని పూర్తిగా రికవరీ చేసి ప్రభుత్వ పరంగా స్వాధీనం చేసుకోవాలని కోరారు. అధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి తక్షణమే కబ్జాదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించని పక్షంలో ఏజెన్సీ ప్రాంతవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరవధిక దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story