Bhadrachalam: భద్రాచలం గోదావరి మాతకు రామాలయ అర్చకుల పంచహారతులు!

Bhadrachalam: కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం రామాలయం అర్చకులు గోదావరి నదికి వైభవంగా పంచహారతులు సమర్పించారు. అనంతరం కాశీ విశ్వేశ్వర ఆలయంలో జ్వాలా తోరణం నిర్వహించారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 25 Nov 2026 8:08 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం గోదావరి మాతకు రామాలయ అర్చకుల పంచహారతులు!

భద్రాచలం నవంబర్25: కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి వేడుకలు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రతిరోజు ప్రత్యేక పూజల్లో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

సాయంత్రం గోదావరి నదీ తీరంలో గోదావరి నదికి అర్చక స్వాములు వైభవంగా నదీ హారతిని సమర్పించారు. నదీహారతిలో భాగంగా గోదావరికి శాస్త్రోక్తంగా,వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చక స్వాములు పంచహారతులను సమర్పించారు. ఎంతో పవిత్రంగా భావించే కార్తీకమాసంలో జరుగుతున్న ఈ నదీహారతి వేడుకను తిలకించి ఆశీర్వచనం పొందేందుకు వందలాది సంఖ్యలో భక్తులు నది తీరానికి చేరుకొని నదీహారతి వేడుకలో సమర్పించిన పంచహారతులను సేవించి తరించారు.

అనంతరం భద్రాద్రి దేవస్థానం ఉపాలయమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కూడా అర్చకులు జ్వాలాతోరణం వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎంతో భక్తిశ్రద్ధలు నడుమ నయనానందకరంగా సాగిన జ్వాలాతోరణం వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem