Bhadrachalam: పోడు భూముల్లో మొక్కలు - అటవీ అధికారులపై చర్యలకు డిమాండ్

Bhadrachalam: చర్ల మండలం చిన్నమిడిసిలేరులో పెసా గ్రామసభ లేకుండా పోడు భూముల్లో మొక్కలు నాటిన అధికారులపై చర్యలు కోరుతూ అటవీ హక్కుల చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 16 Nov 2026 7:07 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: పోడు భూముల్లో మొక్కలు - అటవీ అధికారులపై చర్యలకు డిమాండ్

భద్రాచలం: చర్ల మండలం చిన్నమిడిసిలేరు గ్రామంలో పెసా గ్రామసభ నిర్వహించకుండా, గిరిజనుల సంతకాలు, తీర్మానం లేకుండా వారు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అక్రమంగా మొక్కలు నాటిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అటవీ హక్కుల చైర్మన్ శ్రీ పొడెం వీరయ్య గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో *సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్, చర్ల మండల కార్యదర్శి కామ్రేడ్ సంతపూరి సురేష్ మాట్లాడుతూ... చిన్నమిడిసిలేరు గ్రామంలో గిరిజనులను ఫారెస్ట్ అధికారులు రెండు వర్గాలుగా విడదీసి, ఒక వర్గానికి మాత్రమే పట్టాలు ఇచ్చి మరో వర్గానికి అన్యాయం చేశారని ఆరోపించారు.

2019లో పోడు సర్వే చేసే సమయంలో చంద్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో గిరిజనులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగి, ఒక గిరిజనుడు రేంజర్‌ను నరికి చంపిన ఘటన జరిగిందని, ఆ ఘటనను సాకుగా చూపి అప్పటి నుండి మా చిన్నమిడిసిలేరులో (పోడు) సర్వేను నిలిపివేశారని, దీనివల్ల తమకు పట్టాలు రాలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ పోడు భూముల సర్వే చేయాలని డిమాండ్ చేశారు.

5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో పెసా చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి తప్పనిసరి అని, కానీ గ్రామసభ పెట్టకుండా పోడు భూముల్లో మొక్కలు నాటడం పెసా చట్టాన్ని, అటవీ హక్కుల చట్టం-2006ను ఉల్లంఘించడమేనని అన్నారు.

ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ సర్వే చేసి రిపోర్ట్ పంపాలని ఆదేశాలు ఇస్తే, దానికి విరుద్ధంగా ఫారెస్ట్ అధికారులు పోడు రైతులను "కేసులు పెడతాం, రేషన్ కార్డులు రద్దు చేస్తాం" అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆ మొక్కలను తొలగించి, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై చైర్మన్ పొడెం వీరయ్య గారు సానుకూలంగా స్పందించి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. లేని యెడల ఫారెస్ట్ అధికారులపై గిరిజనుల తిరుగుబాటు తప్పదని, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీగా హెచ్చరిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి కామ్రేడ్ కొంజ జోగారావు, రామకృష్ణ, జానకి, వెంకటమ్మ, రామలక్ష్మి, తుర్రం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem