Bhadradrachalam: భద్రాచలంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష!

Bhadradrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధి, గోదావరి పుష్కర ఘాట్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్. ప్రణాళికలు సిద్ధం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 13 Oct 2026 5:20 PM IST
Bhadradrachalam
X

Bhadradrachalam: భద్రాచలంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష!

Bhadradrachalam: గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లతో కలిసి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.

ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకున్న కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకోగా, అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. దర్శనానంతరం ఆలయ ఉత్తర ద్వారం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్, ఆలయ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ నిర్మాణం, రక్షణ గోడలు, మట్టి నింపే పనులు తదితర నిర్మాణాలను పరిశీలించి, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం ఆలయం నుంచి గోదావరి స్నాన ఘాట్లకు వెళ్లే రహదారిని పరిశీలించిన కలెక్టర్, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రహదారిని విస్తరించాలని ఆదేశించారు. ప్రస్తుతం సుమారు 25 అడుగుల వెడల్పు ఉన్న రహదారిని మరో ఐదు అడుగులు విస్తరించి 30 అడుగులకు పెంచే ప్రతిపాదనపై చర్చించారు. రహదారికి ఇరువైపులా ఉన్న నిర్మాణాలు, మెట్లు, ఇతర అడ్డంకులను పరిశీలించి అవసరమైన చోట్ల మార్కింగ్ చేయాలని సూచించారు. భూమికి సంబంధించిన అంశాలు, అనుమతులు, నిధులు, బిల్లుల పరిష్కారంలో రోడ్లు భవనాలు, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

వైకుంఠధామానికి వెళ్లే మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్, పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న రహదారికి ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టడంతో పాటు వైకుంఠధామం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. విద్యుత్ దహనవాటికతో పాటు ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు పొందడం, టెండర్ ప్రక్రియను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని తెలిపారు.

పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, ఉత్తర వైపు సుమారు 270 మీటర్లు, దక్షిణ వైపు 230 మీటర్ల పొడవున చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఘాట్ల వద్ద మెట్లు, ల్యాండింగ్ ప్రాంతాలు, రక్షణ గోడలను పటిష్టంగా నిర్మించాలని, పాత గోడలకు పగుళ్లు ఏర్పడిన చోట మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పర్ణశాల వద్ద టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

పుష్కరాలకు వచ్చే భక్తుల వసతి కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో డార్మిటరీ హాల్ నిర్మిస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. గోశాల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. భద్రాచలంతో పాటు చర్ల, అశ్వాపురం, దుమ్ముగూడెం, పర్ణశాల, కిన్నెరసాని పరిసర ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూపొందించిన ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు.

అనంతరం సారపాక బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్, ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రహదారి సుందరీకరణకు చేపట్టాల్సిన చర్యలపై ఐటీసీ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో చర్చించారు. రహదారి మధ్య విభాజకాలు, ఇరువైపులా పుష్పించే మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని, బౌగెన్‌విల్లియా వంటి రంగురంగుల పూల మొక్కలతో సుందరీకరణ చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను వారం రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , గత మార్చి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన అనంతరం ఇరిగేషన్, దేవాదాయ, రోడ్లు భవనాల శాఖల ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, పుష్కరాల ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆలయ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో చేపట్టిన పనులను వేగవంతం చేసి ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి, గోదావరి పుష్కరాల గడువులోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం సుమారు 200 మంది కార్మికులతో పాటు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లైటింగ్ సౌకర్యంతో పనులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

గోదావరి పుష్కరాల కోసం ఉత్తర, దక్షిణ వైపులా మంజూరైన 270 మీటర్లు, 230 మీటర్ల పొడవైన ఘాట్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. భద్రాచలం ప్రధాన పుష్కర క్షేత్రంగా ఉన్నందున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కిన్నెరసాని పరిసరాలు, అశ్వాపురం, దుమ్ముగూడెం, పర్ణశాల తదితర ప్రాంతాల్లోనూ అవసరమైన సౌకర్యాలు కల్పించే అంశాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. భక్తుల వసతి కోసం డార్మిటరీ హాల్ నిర్మాణంతో పాటు గోశాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

గోదావరి పుష్కరాలకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చిలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు జూన్ 27 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, రవాణా, పోలీసు భద్రత, వైద్య సేవలు తదితర మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పించాలని తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల నుంచే అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా ప్రారంభించి, పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.

ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్ బి ఈ ఈ నాగేశ్వరరావు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, తహసిల్దార్ రవికుమార్ ఇన్చార్జి ఎంపీడీవో జిపిఈఓ శ్రీనివాస్ దేవస్థానం డి ఈ రవీందర్రావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.