Kothagudem: ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ అంకిత్!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ సమీక్ష 190 కేంద్రాల ద్వారా 1.28 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ సన్నాలకు రూ.500 బోనస్, క్వింటాకు రూ.2,961.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 Sept 2026 10:30 PM IST
Kothagudem
X

Kothagudem: ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ అంకిత్!

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 29: వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సీజన్‌లో జిల్లాలో సుమారు 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో 1,24,119 మెట్రిక్ టన్నుల సన్న రకం, 3,881 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం 190 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. సన్న రకం ధాన్యానికి అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ అందుతుందని చెప్పారు. దీంతో అర్హత కలిగిన సన్న రకం ధాన్యానికి క్వింటాకు మొత్తం రూ.2,961 వరకు లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తూకపు పరికరాలు, గన్నీ సంచులు వంటి వసతులను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా తరలివచ్చే అవకాశాలను అరికట్టేందుకు సరిహద్దుల్లో నిఘా పెంచాలని తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రసీదులు అందించాలని, చెల్లింపులు సకాలంలో జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు.

నాణ్యత పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం, తరుగు పేరుతో అన్యాయంగా కోతలు విధించడం సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. అక్టోబర్ 1 నాటికి అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 2026–27 రబీ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలను సకాలంలో పూర్తి చేసేలా రైస్ మిల్లులను తనిఖీ చేయాలని సూచించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM