Bhadradri Kothagudem: జనగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశం
Bhadradri Kothagudem: జిల్లాలో జనగణన ఇంటింటి సర్వే ప్రారంభమైంది. జూన్ 9 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో ప్రతి ఇంటి వివరాలను పక్కాగా సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
భధ్రాద్రి కొత్తగూడెం: జనగణన కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి ప్రారంభమైన ఇంటింటి సర్వే అత్యంత కీలకమైన ప్రక్రియ అని, అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన సర్వే నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ గణన ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ప్రత్యేక చార్జ్ అధికారులు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు సర్వే పూర్తైన అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యూమరేటర్ కిట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే అదనంగా మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.నేటి నుండి ప్రారంభమైన గృహ గణన ప్రక్రియ జూన్ 9వ తేదీ వరకు కొనసాగనుందని తెలిపారు. ఈ కాలంలో ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి నిర్దేశిత ఫార్మాట్‌లో వివరాలను నమోదు చేయనున్నారని చెప్పారు. ఇంటి నంబర్, గదుల సంఖ్య, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు, ద్విచక్ర వాహనాలు లేదా కార్ల వివరాలు, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు .
ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలు, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనలో ఈ గణాంకాలు కీలకంగా ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జనగణన సర్వేను విజయవంతం చేయాలని సూచించారు.




