Palvoncha: 2030 నాటికి బాల్యవివాహ రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యం!

Palvoncha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేజీబీవీలో జరిగిన ‘బాల్యవివాహ రహిత భారత్’ సదస్సులో 2030 నాటికి బాల్యవివాహాల నిర్మూలనే లక్ష్యమని డీఎంహెచ్‌వో డాక్టర్ తుకారామ్ రాథోడ్ పేర్కొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 27 Nov 2026 1:49 PM IST
Kothagudem
X

Palvoncha: 2030 నాటికి బాల్యవివాహ రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యం!

పాల్వంచ: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ పిలుపునిచ్చారు. 2030 నాటికి భారతదేశాన్ని పూర్తిస్థాయిలో బాల్యవివాహ రహిత దేశంగా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.

అంతర్జాతీయ బాల్య, ముందస్తు మరియు బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచలోని ఇందిరానగర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన 'బాల్యవివాహ రహిత భారత్' అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ తుకారామ్ రాథోడ్ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల విద్యకు దూరమవడంతో పాటు గర్భధారణ, ప్రసవ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. బాలికల వ్యక్తిగత అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబనకు బాల్యవివాహాలు ఆటంకంగా మారుతాయని వివరించారు.

ప్రతి బాలికకు విద్యను అభ్యసించే హక్కు, ఆరోగ్యంగా జీవించే హక్కు, తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నాయని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే వివాహాలు చేయకుండా ఉన్నత విద్యను అందించి, తమ పిల్లలు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు.

బాల్యవివాహాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఇది సమాజంలోని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎక్కడైనా బాల్యవివాహాలు, ముందస్తు లేదా బలవంతపు వివాహాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

'బాల్యాన్ని కాపాడుదాం – భవిష్యత్తును భద్రపరుద్దాం.. బాల్యవివాహాలను అరికడదాం – బాల్యవివాహ రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం' అనే నినాదంతో ప్రతి చిన్నారికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన, విద్యావంతమైన బాల్యాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని డాక్టర్ తుకారామ్ రాథోడ్ విజ్ఞప్తి చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM